ఒకే టైటిల్‌తో రెండు సినిమాలంటే ఖచ్చితంగా వివాదాస్పదమవుతాయి. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 'ముద్ర' సినిమాకి పోటీగా జగపతిబాబు హీరోగా నటించిన మరో 'ముద్ర' సైలెంట్‌గా విడుదలై నిఖిల్ 'ముద్ర'కు టోకరా పెట్టిన సంగతి తెలిసిందే. జగపతిబాబు కొట్టిన దెబ్బకి నిఖిల్ యూటర్న్ తీసుకుని తన సినిమా టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. అలా 'ముద్ర' కాస్తా, 'అర్జున్ సురవరం'గా మారింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, తాజాగా మరో సినిమా ఇప్పుడిలాంటి పరిస్థితిలోనే ఉంది. అదే 'ఆకాశవాణి'.
జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా రూపొందుతోన్న సినిమా ఇది. ఆ మధ్య ఈ సినిమా గురించి బాగా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అశ్విన్ గంగరాజు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఓకే ఇదంతా తెలిసిన సంగతే. అయితే తాజాగా 'ఆకాశవాణి' టైటిల్‌తో మరో సినిమా తెరపైకి వచ్చిందండోయ్. అందుకే ఈ గడబిడ. సతీష్ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మర్రిమాకల మల్లిఖార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నామంటూ ఈ టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
దాంతో ఈ టైటిల్ సంగతి బయటికొచ్చింది. అయితే ఈ టైటిల్‌కి 'ఆకాశవాణి - విశాఖపట్టణ కేంద్రం' క్యాప్షన్ జత చేశారు. సో అలా టైటిల్‌కి వేరియేషన్ చూపించారు కానీ, ఈ వేరియేషన్ ఏమంత పెద్ద వేరియేషన్ కాదు. మరి కార్తికేయ టైటిల్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ఇకపోతే రెండో ఆకాశవాణి ఫస్ట్‌లుక్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'నాకో ప్రాబ్లెమ్ ఉంది. అదేంటో సభాముఖంగా చెప్పబోతున్నాను..' అంటూ ఓ వ్యక్తి ముఖాన్ని నీడలో చూపించి ఆశక్తి కలిగించారు. అసలింతకీ 'ఆకాశవాణి - విశాకపట్టణం కేంద్రం' కథేంటో, ఆ వ్యక్తి ప్రాబ్లెమ్ ఏంటో తెలియాలంటే ఆ టీజర్ ఏదో వచ్చేదాకా ఆగాల్సిందే.