వాళ్లందరూ వారసులు, స్టార్స్ కూడా. నటనను వారసత్వంగా ఎంచుకుని, ఆ వారసత్వానికి వన్నె తెచ్చినవాళ్లే. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు ఒకే చోట కూర్చొని ఒకర్నొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఒక గ్రూప్ డిస్కషన్‌లా అనుకోవచ్చేమో. ఇదంతా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రమోషన్ కోసం. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
తండ్రి నుండి నటనను వారసత్వంగా అందుకున్న బాలకృష్ణ విభిన్న చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. దివంగత అక్కినేని మనవడు సుమంత్ గురించి తెలిసిందే. స్వర్గీయ రామానాయుడు మనవడు రానా నేటి తరం స్టార్, హరికృష్ణ తనయుడు కళ్యాణ్‌రామ్, విజయనిర్మల కుమారుడు సీనియర్ నరేష్ గురించి మనకు తెలుసు. వీళ్లంతా 'ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఆయా పాత్రలకు మరింత వన్నె తెచ్చేందుకు తమ వంతుగా ప్రయత్నం చేశామని చెబుతున్నారు.
బాలకృష్ణ కావచ్చు, రానా కావచ్చు, కళ్యాణ్‌రామ్ కావచ్చు, నరేష్, సుమంత్ కావచ్చు అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సినిమా కోసం కష్టపడడం ఒక్కటే కాదు, ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఈ వారసులు చేసిందదే. ఈ వారసుల ప్రయత్నం ఆ వెండితెర వేల్పుల గౌరవాన్ని మరింత ఘనం చేయాలి. తెరపైనా కథానాయకుడుగానే కాదు, పెద్దన్న పాత్ర పోషించి ఇతర నటీనటుల్ని, టెక్నీషియన్లను ఒక్క తాటి పైకి తీసుకొచ్చిన అసలు సిసలు కథానాయకుడు బాలకృష్ణను ఈ సందర్భంగా అభినందించకుండా ఉండలేము.