ఎనభై వసంతాల జీవితం. ఐదు దశాబ్దాల సినీ చరిత్ర...కృష్ణ సొంతం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కృష్ణ చూడని హిట్టు లేదు. ఆయన ముట్టుకోని కథ లేదు. ఆయన చేయని సాహసం లేదు. ఓరకంగా.. కృష్ణది పరిపూర్ణమైన జీవితం అని చెప్పుకొంటారు. చివరి క్షణం వరకూ.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సడన్‌గా... హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో చేరారు. ఒక్క రోజులోనే అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఇక లేరు.
ఇంత ఉన్నతమైన, సంపూర్ణమైన జీవితంలోనూ కొన్ని తీరని కోరికలున్నాయి. కృష్ణ అనుకొంటే అది జరిగి తీరుతుంది. కాకపోతే.. కొన్ని విషయాల్లో ఆయనకు నిరాశ ఎదురైంది. చివరికి తీరని కోరికగా మిగిలిపోయింది. `ఛత్రపతిశివాజీ` కథంటే కృష్ణకు చాలా ఇష్టం. `అల్లూరి సీతారామరాజు` సమయంలోనే ఈ స్క్రిప్టుపై కొంత వర్క్ చేశారు. అయితే ఆ కథలో సున్నితమైన విషయాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన కృష్ణ ఆ కథని పక్కన పెట్టేశారు. తెలుగు తెరకు జేమ్స్ బాండ్ అంటే..కృష్ణనే. తనయుడు మహేష్ బాబునీ అలాంటి పాత్రలో చూద్దామనుకొన్నారు. ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. కానీ అది కూడా కుదర్లేదు.
కృష్ణ, తన కొడుకులిద్దరూ(రమేష్ బాబు, మహేష్ బాబు)లతో నటించారు. మనవడు గౌతమ్ తోనూ ఓ సినిమా చేయాలనుకొన్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. `కేబీసీ` (కౌన్ బనేగా కరోడ్ పతి) కార్యక్రమం అంటే కృష్ణకు చాలా ఇష్టం. అమితాబ్‌బచ్చన్ ఈ షోని బాగా నడుపుతున్నారని చాలాసందర్భాల్లో కితాబు ఇచ్చారు. అలాంటి షో ఒకటి చేయాలనుకొన్నారు. కానీ వీలు కాలేదు.