సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
కృష్ణ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.
1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. కష్ణ హీరోగా నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ . ఈ సినిమా తర్వాత కృష్ణ మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, భలే దొంగలు, మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దు బిడ్డ, నంబర్ 1 ఇలా ఎన్నో చిత్రాలు కృష్ణ కెరీర్ లో మైలు రాయిగా నిలిచాయి.
సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం , ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ , పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.