ప్రవాసీ భారతీయ దివాస్‌లో బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని నృత్య ప్రదర్శన అందర్నీ ఆశ్చర్యపరిచింది. గంగా నది ఎలా కలుషితమవుతోంది.. అనే ఇతివృత్తంగా నృత్య రూపంగా ఆమె ప్రదర్శించిన తీరుకు ఎన్నారైలు ఫిదా అయిపోయారు. కంటిన్యూస్‌గా 90 నిముషాల పాటు సాగిన ఈ నృత్య ప్రదర్శనకు మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్న తీరుగా అందరూ అలా చూస్తుండిపోయారు.
ఏడు పదుల వయసులో హేమామాలిని ఇచ్చిన ఈ నృత్య ప్రదర్శనకు స్వయంగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నోట మాటలు రాలేదంటే ఆమె ప్రదర్శనను సుష్మా ఎంతగా ఆస్వాదించారో అర్ధం చేసుకోవాలి. 'నా జీవితంలో ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడూ చూడలేదు. చూడను కూడా. అత్యద్భుతం..' అంటూ హేమామాలినిపై ప్రశంసల జల్లు కురిపించారు సుష్మా స్వరాజ్.
అంత వయసులోనూ హేమామాలినికి డాన్సుల పట్ల ఆశక్తి తగ్గకపోవడం, ఫిట్‌నెస్ మెయింటెనెన్స్ లెవల్స్ ఇవన్నీ అందర్నీ విస్మయానికి గురి చేశాయి. డ్రీమ్‌గాళ్‌గా హేమామాలినిని ఇప్పటికీ ఆదరించేవారు లేకపోలేదు. పోత పోసిన అందం, వన్నె తరగని అందం అంటే కేరాఫ్ అడ్రస్ హేమామాలిని. తెలుగులో బాలకృష్ణ నూరవ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లో హేమామాలిని బాలయ్యకు తల్లిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.