బాహుబలి రికార్డుల్ని సైరా బద్దలు కొడుతుందా? లేదా? ఇక నుంచి నాన్ బాహుబలి అని కాకుండా - నాన్ సైరా రికార్డులు అని చెప్పుకోగలరా, లేదా? అనే చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది. సైరా తీసేది - బాహుబలి రికార్డుల్ని చెక్ పెట్టడానికే అని ఓ వర్గం చెబుతోంది. అంత దమ్ము సైరాకి ఉందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. విజువల్ గ్రాండియర్ సైరా ట్రైలర్‌లో బాగానే కనిపిస్తోంది. బాహుబలి తో పోల్చడం కష్టం గానీ, దానికి ఏమాత్రం తీసిపోకుండానే సైరా ట్రైలర్ ఉంది.
దానికి తగ్గట్టుగానే సైరా బిజినెస్ ఓస్థాయిలో జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమాకి 120 కోట్లకు అమ్మారని టాక్. ఆ డబ్బుల్ని పంపిణీదారులు తిరిగి రాబట్టుకోవాలంటే దాదాపు 160 కోట్లు రావాలి. అంటే.. బాహుబలి రికార్డుల్ని క్రాస్ చేయక తప్పదు. భరత్ అనే నేను, రంగస్థలం, ఖైది నెం.150 వసూళ్లన్నీ తెలుగులో 80 కోట్లు దాటలేదు. సైరా పెట్టుబడి తిరిగి రావాలంటే... దానికి డబుల్ రావాలి.
అదే జరిగితే తెలుగు రాష్ట్రాల వరకూ బాహుబలిరికార్డు కూడా బద్దలైపోయినట్టే. `సైరా` టికెట్టు రేట్లు పెంచే విషయంలో ఇప్పటికే థియేటర్ యాజమాన్యం న్యాయస్థానాల్ని ఆశ్రయించింది. టికెట్ రేటు 200 వరకూ పెంచాలని విన్నవించుకుంటోంది. అదే జరిగితే... సైరా ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. దసరా సెలవులు ఎలాగూ కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి - టాక్ బాగుంటే - కొత్త రికార్డులు చూసే అవకాశమూ దక్కుతుంది.