ఓ పక్క మహేష్ బాబు సినిమా - మహర్షికి ఉదృతంగా వసూళ్లు వస్తున్న వేళ, దానికి పోటీగా మరో సినిమాని రంగంలోకి దింపడం అత్యంత సాహసమే అనుకోవాలి. అలాంటి సాహసమే చేశాడు అల్లు శిరీష్. `ఏబీసీడీ`ని ఈ వారం విడుదల చేశాడు. మహర్షి తొలి వారం బంపర్ వసూళ్లు సాధించి - రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తుందనుకున్న తరుణంలో ఈ సినిమా వచ్చింది. మరి... అల్లు వారి అబ్బాయి మహర్షికి ధీటుగా నిలబడ్డాడా? తనకంటూ కొన్నయినా వసూళ్లు సాధించాడా..?? శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏబీసీడీ బాక్సాఫీసు దగ్గర దారుణంగా బోల్తా పడింది.
ఓ రీమేక్ కథని ఎంచుకుని రిస్క్ లేని ప్రయాణం చేద్దామనుకున్న శిరీష్ ప్రయత్నానికి గట్టి దెబ్బ తలిగింది. ఈ సినిమా అన్ని విభాగాల్లో విఫలమై డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తొలి రోజే వసూళ్లు దారుణంగా ఉన్నాయి. శనివారం మరింత తగ్గాయి. ఈ వీకెండ్ కూడా మహర్షి డామినేట్ చేసేసింది. నటుడిగా... శిరీష్ కొన్ని ప్లస్ పాయింట్లు చేజిక్కించుకున్నా, వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడ వర్కవుట్ అయినా - మిగిలిన విభాగాలన్నీ కలసి కట్టుగా విఫలమయ్యాడు. ఫన్ అంతగా లేకపోవడం, ద్వితీయార్థం మరీ బోరింగ్‌గా సాగడం ఈ సినిమాకి శాపాలుగా మారాయి. దాంతో శిరీష్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టైంది.
ఏబీసీడీతో పాటు మరో రెండు చిన్న సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. రొమాంటిక్ క్రిమినల్స్, స్వయంవధ.. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటిని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఈ సినిమాలు ఏ థియేటర్లో ఆడుతున్నాయో ప్రేక్షకులకు కూడా అర్థం కాని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి ఓ స్టార్ హీరో సినిమా విడుదలై.. హిట్టయినప్పుడు.. ఓ రెండు వారాల వరకూ మరో సినిమాని విడుదల చేయడం సాహసమని చెప్పడానికి ఈ మూడు చిత్రాలూ ఉదాహరణగా నిలిచాయి.