2018 కి బైబై చెబుతూ చివరి వారంలోనూ... కొత్త సినిమాలు జోరుగా వచ్చాయి. శుక్రవారం, శనివారం కలిసి 4 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బ్లఫ్ మాస్టర్, ఇదంజగత్, మైడియర్ మార్తాండం, ఇష్టంగా బాక్సాఫీసు పోటీకి సిద్ధపడ్డాయి. మరి వీటిలో మిమర్శకులు మెచ్చిన సినిమా ఏది? వసూళ్లు దేనికి దక్కాయి..?
డిసెంబరులో చిత్రసీమకు ఏమాత్రం కలసి రాలేదు. విడుదలైన ప్రతీ సినిమా నిరాశ పరిచింది. ఈ వారం కూడా అందకు మినహాయింపు కాదు. విడుదలైన నాలుగు చిత్రాల్లో దేనికీ హిట్ టాక్ దక్కలేదు. కాస్తలో కాస్త `బ్లఫ్ మాస్టర్`కే వసూళ్లు బాగున్నాయి. సత్యదేవ్ నటించిన చిత్రమిది. తమిళ `శతురంగ వెట్టై`కి రీమేక్. పూరి శిష్యుడు గోపీ గణేష్ దర్శకత్వం వహించారు. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా.. ద్వితీయార్థంలో గాడి తప్పింది. సంభాషణలు, సత్యదేవ్ నటన హైలెట్‌గా నిలిచాయి. అవే ఈ చిత్రాన్ని కొంతలో కొంత కాపాడాయి.
ఇక `ఇదం జగత్`.. ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. సుమంత్ నటించిన చిత్రమిది. అనిల్ శ్రీకంఠం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం సరైన కథ, కథనాలు లేకపోవడంతో డీలా పడింది. విడుదలకు ముందు చిత్రబృందం సరిగా ప్రచారం కూడా చేసుకోకపోవడంతో వసూళ్లు ఏమాత్రం బాలేదు.
ఇక ఫృథ్వీ నటించిన `మైడియర్ మార్తాండం`, కొత్త వాళ్లతో చేసిన `ఇష్టంగా` కూడా ఫ్లాపు జాబితాలో చేరిపోయాయి. కుర్రాళ్లంతా కొత్త యేడాది సంబరాల బిజీలో ఉండడం, ఏ సినిమాకీ సరైన రివ్యూలు లేకపోవడంతో.. థియేటర్ల కు జనాలు వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఎలాగూ సంక్రాంతి సినిమాల జాతర మొదలైపోతోంది కదా? తెలుగు సినిమా వసూళ్లతో కళకళలాడాలంటే.. అప్పటి వరకూ ఎదురుచూడాల్సిందే.
ఇదీ ఈ వారం ఐక్లిక్ టాక్ ఆఫ్ ది వీక్...