స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. తన ఇమేజ్‌ని సినిమా సినిమాకీ పెంచుకుంటూ వెళ్లాడు. సినిమాని ప్రమోట్ చేసే విధానంలోనూ విజయ్ కొత్త పోకడల్ని అవలంభిస్తున్నాడు. అందుకే విజయ్ దేవరకొండ నుంచి ఓ సినిమా వస్తోందంటే... దానిపై ఫోకస్ పెరుగుతోంది. ఎలా ఉన్నా సరే.. చూసేయాల్సిందే అనిపించేస్తోంది. ఇప్పుడు ఈ రౌడీ నుంచి మరో సినిమా వచ్చింది. అదే `వరల్డ్ ఫేమస్ లవర్`. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా వుంది? కలక్షన్ల పరిస్థితేంటి?
టైటిల్ బట్టి చూస్తే..ఇదో ప్రేమకథ అని అర్థమైపోతోంది. అయితే ఇందులో ఒక ప్రేమకథ కాదు, మూడు ప్రేమకథలు జొప్పించాడు దర్శకుడు. ఒక ప్రేమకథకూ, మరో ప్రేమకథకూ ఎక్కడా సంబంధం లేదు. కానీ మూడు చోట్లా ఒక్కడే ప్రేమికుడు. నిజంగానే చాలా మంచి పాయింట్ ఇది. ఇది నచ్చే విజయ్ దేవరకొండ రంగంలోకి దిగి ఉంటాడు. కానీ ఈ ఆసక్తికరమైన కథని, ప్రేక్షకులకు నచ్చేలా మాత్రం దర్శకుడు తీయలేకపోయాడు. మూడు ప్రేమకథలూ రొటీన్‌గానే సాగడం, అర్జున్ రెడ్డి ఫ్లేవర్‌ని వదలడానికి విజయ్ దేవరకొండ ఇష్టపడకపోవడంతో రొటీన్ సినిమా చూసినట్టే అనిపించింది. దానికి తోడు పాటలు ఏమాత్రం ప్లస్ కాలేకపోయాయి. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్ తమ నటనతో మెప్పించినా ఫలితం లేకుండా పోయింది. తొలి రోజే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.కానీ వసూళ్లు బాగుండడంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు. నెగిటీవ్ రివ్యూల వల్ల.. రెండో రోజు వసూళ్ల హవా బాగా తగ్గింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా ఫైనల్ రిపోర్ట్ ఏమిటన్నది తెలిసిపోతుంది.
ఈ సినిమాతో పాటు `శివ 143` లాంటి చిన్న చిన్న సినిమాలు రెండు,మూడు విడుదలయ్యాయి. అయితే... వాటిని ప్రేక్షకుడు పూర్తిగా లైట్ తీసుకున్నాడు. వచ్చేవారం `భీష్మ` విడుదల అవుతోంది. నితిన్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.