ఈ వారం బాక్సాఫీసు దగ్గర చిన్న సినిమాలు కొన్ని సందడి చేశాయి. అయితే.. అందరి దృష్టీ `యాత్ర`పైనే. వైఎస్ఆర్ చేసిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించడం, ఈ సినిమా రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువు అవ్వడంతో `యాత్ర` ఫలితం ఎలా ఉంటుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూల్ని దక్కించుకుంది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో.. తొలి రోజు 2.4 కోట్ల షేర్ సాధించింది. శనివారం కూడా ఓ మోస్తరు వసూళ్లు కనిపించాయి. బాక్సాఫీసు దగ్గర మరో సినిమా ఏదీ లేకపోవడం `యాత్ర`కు కలిసొచ్చే విషయం. తెలుగు, తమిళ, మలయాళ శాటిలైట్ హక్కుల రూపంలో నిర్మాతకు భారీ మొత్తం రానుంది. ఆ లెక్కన చూస్తే యాత్రకు మంచి లాభాలే వస్తాయన్న ఆశ ఉంది.
ఈ సినిమాతో పాటు విడుదలైన సచిన్ జోషి `అమావాస్య` గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ లభించలేదు. దాంతో పాటు.. థియేటర్లో జనాలకు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. సో... ఈ సినిమా కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయినట్టే భావించాలి.
ఇక ఈ వారం అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రధానమైన ఎపిసోడ్ బోయపాటి వెర్సెస్ డి.వి.వి. దానయ్య. `వినయ విధేయ రామ` సినిమా ఫ్లాప్ అయ్యిందని నిర్థారిస్తూ రామ్ చరణ్ అభిమానులకు లేఖ రాయడం కలకలం సృష్టించింది. ఆ తరవాత పరిణామాలన్నీ చాలా వేగంగా మారాయి.
దర్శకుడు నష్టపరిహారంగా రూ.5 కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్మాత డిమాండ్ చేయడం, అందుకు బోయపాటి ససేమీరా అనడం, ఈ పంచాయితీ పెద్దల వరకూ వెళ్లడం వేడి పుట్టించింది. చివరికి రంగంలో చిరు, అరవింద్ దిగాల్సివచ్చింది. బోయపాటి నష్టపరిహారం చెల్లిస్తాడా, లేదా? చెల్లిస్తే ఎంత ఇస్తాడు? అనేది ఆసక్తిగా మారింది.