`వినయ విధేయ రామ` నష్టపరిహారం ఎపిసోడ్ టాలీవుడ్‌లో హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ భారీ నష్టాల్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో దాదాపుగా రూ.30 కోట్లు నష్టాలొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి రామ్ చరణ్ ముందుకొచ్చాడు. బోయపాటి శ్రీను తన వాటాగా రూ.5 కోట్లు ఇవ్వాల్సివుంది.
అయితే పారితోషికాన్ని తిరిగి చెల్లించే విషయంలో బోయపాటి మీనమేషాలు లెక్కేయడం అటు నిర్మాతకూ, ఇటు రామ్ చరణ్‌కీ నచ్చడం లేదు. దాంతో డివివి దానయ్య - బోయపాటిల మధ్య వాగ్వీవాదం కూడా జరిగింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక మరో హీరో పేరు వినిపిస్తోంది. ఆ పేరే.. ఎన్టీఆర్. చరణ్, దానయ్యలని ఉసిగొల్పింది ఎన్టీఆరే అని, అప్పటి నుంచీ ఈ నష్టపరిహారం గొడవ తెరపైకొచ్చిందని ఫిల్మ్‌నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దాంతో బోయపాటికీ, ఎన్టీఆర్‌కీ మధ్య ఏమైంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 'దమ్ము' అనే ఓ సినిమా వచ్చింది. అది ఫ్లాప్. ఆ సినిమా పరాజయం పాలైనప్పటి నుంచీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందట. "ఆ సినిమా పోయినప్పుడు బోయపాటి నుంచి పైసా కూడా వెనక్కి తీసుకురాలేకపోయా. మీరైనా మీ డబ్బుని తిరిగి తెచ్చుకోండి" అని ఎన్టీఆర్ సలహా ఇవ్వడంతోనే ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో ఎన్టీఆర్‌కీ, వినయ విధేయ రామ టీమ్‌కే తెలియాలి.