నవంబర్ - డిసెంబరు నెలలు సినిమాలకు సంబంధించినంత వరకూ బ్యాడ్ సీజన్. సంక్రాంతి ముందు కాస్త స్థబ్దత ఉంటుంది. పెద్దగా సినిమాలు విడుదల కావు. వచ్చినా, నిలబడవు. అయితే ఈసారి వారానికి రెండు మూడు సినిమాలు వరుస కడుతున్నాయి. బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల మెరుపులకు కొదవ లేదు. అయితే.. విజయాలు మాత్రం అరకొర దొరుకుతున్నాయి. ఈ వారం విడుదలైన రెండు చిత్రాలదీ దారుణమైన పరిస్థితే.
శ్రీవిష్ణు నటించిన తిప్పరా మీసం - ఈ వారమే విడుదలైంది. ఇదో ఎమోషనల్ డ్రామా. అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కువగా కనిపించాయి. శ్రీవిష్ణు నటన, సాంకేతిక నైపుణ్యం బాగానే ఉన్నా - కథ, కథనాలు మరీ బోరింగ్‌గా సాగాయి. సన్నివేశాలలో సాగదీత బాగా ఇబ్బంది పెట్టింది. నమ్ముకున్న అమ్మ సెంటిమెంట్ బలంగా తెరకెక్కించలేకపోయాడు. యాక్షన్ ఎక్కువై.. మిగిలిన అంశాలు తక్కువయ్యాయి. దాంతో - విమర్శకులు ఈ సినిమాని ఫ్లాప్‌గా తేల్చేశారు. దానికి తగ్గట్టే.. బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం నిలబడలేకపోతోంది. అన్ని ఏరియాల్లోనూ థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బ్రోచేవారెవరురాతో ఓ కమర్షియల్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు... ఆ ఫామ్‌ని ఈ సినిమాతో కొనసాగించలేకపోయాడు.
ఇక గురువారం వచ్చిన `ఏడు చేపల కథ` గురించి చెప్పుకోవాలి. టీజరూ, ట్రైలరూ హాట్ హాట్‌గా కట్ చేయడంతో - ఈ సినిమాలో ఏదో ఉందని కుర్రకారు ఎగబడుతున్నారు. తీరా సినిమా చూసి `ఇదేం సినిమారా బాబూ` అంటూ తలలు పట్టుకుని థియేటర్ల బయటకు వస్తున్నారు. ఏమాత్రం విషయం లేని సినిమాగా దీన్ని విమర్శకులు తేల్చేశారు. సెన్సార్ కత్తెర్లకు బలవ్వడంతో... సినిమాలో జంపులు బాగా కనిపించాయి. హాట్ హాట్ దృశ్యాలకు కత్తెర్లు పడిపోయాయి. దాంతో ఈ సినిమా తలా తోక లేకుండా తయారైంది. అయితే... బీ, సీ సెంటర్లలో కుర్ర కారు ఎగబడుతుండడంతో కాస్తో కూస్తో వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజు అయితే.. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మొత్తానికి ఈవారం కూడా నిరాశే ఎదురైంది. వచ్చే వారం... కూడా సినిమాల హడావుడి బాగానే ఉన్నట్టుంది. కనీసం హిట్టు అనే మాట ఆ వారమైనా వినిపిస్తుందేమో చూడాలి.