మిల్కీ బ్యూటీ తమన్నా పాపం తెగ కష్టపడిపోతోంది. ఎందుకంటారా ఇదంతా 'క్వీన్' సినిమా కోసమే. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది తమన్నా. బాలీవుడ్‌లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన 'క్వీన్' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. నేషనల్ అవార్ట్ విన్నర్ అయిన నీలకంఠ ఈ సినిమాని తెలుగులో తెరకెక్కిస్తున్నారు.
ఇంతవరకూ గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న తమన్నాకి ఈ సినిమా కెరీర్‌లోనే స్పెషల్ అంటోంది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న మూవీ ఇది. అందుకే ఈ సినిమా కోసం చాలా డెడికేటెడ్‌గా పని చేస్తోందట. అందులో భాగంగానే ఈ సినిమా కోసం తమన్నా తన శరీరాన్ని తెగ కష్టపెట్టేస్తోంది. అసలే నాజూకు అందాల భామ తమన్నా. అయితే ఈ సినిమా కోసం మరింత స్లిమ్‌గా తయారు కానుంది. అందుకోసం మార్నింగ్ నుండే కసరత్తులు స్టార్ట్ చేస్తోంది. రకరకాల ఎక్సర్‌సైజులూ, యోగా టిప్స్‌తో తన శరీరాన్ని మరింత షేప్ చేస్తోంది తమన్నా. ఈ కసరత్తులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు చూసి తమన్నా అభిమానులు అయ్యో మిల్కీ బ్యూటీ పాపం తెగ కష్టపడుతోందే అనుకుంటున్నారు.
ఈ మధ్య తమన్నా కొం..చెం.. బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. కానీ 'క్వీన్' కోసం స్లిమ్‌గా కనిపించాలన్న డైరెక్టర్ సూచనల మేరకు ఈ కసరత్తులు.స్టార్ట్ చేసింది. అందుకోసం స్పెషల్‌గా ఓ ట్రైనర్‌ని కూడా పెట్టుకుంది. ట్రైనర్ సమక్షంలోనే ఈ కసరత్తులు చేస్తోంది తమన్నా. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫ్రాన్స్‌లోనే జరుగుతోంది. కాగా ఈ సినిమాని తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. తమిళంలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ కూడా ఈ సినిమా కోసం స్లిమ్‌గా మరింత అందంగా మారిపోయింది. మలయాళంలో మంజిమా మోహన్ నటిస్తోంది.