తాప్సి కథానాయికగా నటించిన `ఆనందో బ్రహ్మ` తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడడం అనే వినూత్న కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ చిత్రం - హారర్ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. తమిళంలో తాప్సికి మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాని అక్కడ కూడా తాప్సీ తోనే రీమేక్ చేస్తారేమో అనుకున్నారు. అయితే.. ఆ అవకాశం తమన్నాకి దక్కింది. తమన్నాతో ఈ సినిమాని తమిళంలో పునః నిర్మించడానికి సన్నాహాలు మొదలైపోయాయి.
రోహిణ్ వెంకటేశన్ అనే దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అభినేత్రి, అభినేత్రి 2 సినిమాలు హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కినవే. తెలుగులో ఈ చిత్రాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తమిళంలో మాత్రం.. మంచి వసూళ్లనే అందుకున్నాయి. అందుకే.. తమన్నాని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ ఆఫర్ ముందు తాప్సీ దగ్గరకే వెళ్లిందని, ఓసారి చేసిన పాత్ర మరోసారి చేయడానికి తాప్సి సిద్ధంగా లేకపోవడంతో.. చివరికి తమన్నాని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైతే ఏం... తమన్నా చేతిలో మరో సినిమా చేరిపోయింది.