ఇప్పుడు ఎక్కడ విన్నా 'మణికర్ణిక' గురించిన చర్చే. కారణం సినిమా అద్భుతంగా రూపొందింది అని కాదు, సినిమా క్రెడిట్‌ని పంచుకునేందుకు దర్శకుడు క్రిష్, నటి కంగనా పోటీ పడుతుండడమే. నటన మాత్రమే కాదు, ఈ సినిమాకి కొంతమేర దర్శకత్వం కూడా వహించింది కంగనా. ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా స్పందించింది.
క్రిష్ మంచి దర్శకుడిగా తనకు తెలుసనీ, అదే సమయంలో నటిగా కంగనా రనౌత్ గురించీ, తనకు బాగా తెలుసనీ, ఇద్దరూ తమ తమ విభాగాల్లో చాలా కష్టపడ్డారనీ, ఇప్పుడు ఏదైతే వివాదం తెరపైకి వచ్చిందో, అది దురదృష్టకరమనీ తమన్నా అభిప్రాయపడింది. నటిగా కంగనాని ఎవరూ బీట్ చేయలేరు. ఆ స్థాయిలో ఉంది 'మణికర్ణిక' సినిమాలో ఆమె నటన.
క్రిష్ ఎంత మేర సినిమాకి దర్శకత్వం వహించాడు.? కంగనా మెగాఫోన్ పనితనం ఎంతలా పని చేసింది.? అనే విషయాల్ని పక్కన పెట్టి, ఈ ఇద్దరూ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాను అని తమన్నా తెలిపింది. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా తమన్నా భలే తెలివైన సమాధానమిచ్చింది 'మణికర్ణిక'పై ఆమెను ప్రశ్నించినప్పుడు. కంగనా నటించిన సూపర్ హిట్ సినిమా 'క్వీన్' తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. 'దటీజ్ మహాలక్ష్మి' పేరుతో ఈ సినిమా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.