'భరత్ అనే నేను' అంటూ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.. 'భరత్ అనే నేను' సినిమాలో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. బోయపాటి శ్రీను సినిమాలో.
అవును.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాలకృష్ణ నిర్మాతగానూ వ్యవహరిస్తారు. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందులో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో ఇది వరకు రెండు సినిమాలు వచ్చాయి. 'సింహా', 'లెజెండ్'లు సూపర్ హిట్టయ్యాయి. ఇది హ్యాట్రిక్ సినిమా. ఈసారి అంతకు మించిన విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నాడు బోయపాటి. ఇటీవల విడుదలైన 'వినయ విధేయ రామ' అంచనాలను తల్లకిందులు చేసి ఫ్లాప్ అయ్యింది. ఆ లెక్క బాలయ్య సినిమాతో సరి చేయాలని చూస్తున్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో చూడాలి.