మనదేశం చాలామంది ప్రధానుల్ని చూసింది. అందులో అపరమేధావులు ఉన్నారు. అత్యంత సమర్థులూ ఉన్నారు. కొంతమంది రబ్బర్ స్టాంపులూ కనిపిస్తారు. అయితే.. పరిస్థితులకు ఎదురొడ్డి, కేవలం దేశ శ్రేయస్సుని కాంక్షించి, అందుకోసం తన పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమైన ప్రధానులు చాలా తక్కువమంది. అలాంటి వాళ్లలో.. మన్మోహన్ సింగ్ ఒకరు. ఆయన కథ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కుతోంది. మన్మోహన్ పాత్రని అనుపమ్ ఖేర్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు.
సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? ఆయన పదవీ కాలంలో ఎలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు? క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? రాజకీయ ఎత్తుగడలకు ఆయన ఎలా బలయ్యారు..? ఇలాంటి విషయాలన్నీ ఇందులో పూస గుచ్చినట్టు చూపించబోతున్నారు. మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్ అచ్చుగుద్ది నట్టు సరిపోయారు. ఆయన గొంతు, నడక, బాడీ లాంగ్వేజ్ అన్నీ.. మన్మోహన్ ని తలపిస్తున్నాయి.
ఈ కథలో సోనియా గాంధీ పాత్రకూ కీలక స్థానం ఉంది. అందులో సుసాన్నే బెర్నెట్ నటించారు. ఆమె ను చూస్తే... సోనియానే ఈ సినిమా కోసం తీసుకొచ్చారా? అనే అనుమానాలు కలుగుతాయి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లను పోలిన పాత్రలు ఈ కథలో కనిపిస్తాయి. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. అందులోనూ ఓ ప్రధాని కథ. అందుకే ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ట్రైలర్‌లో ఉన్న టెంపో... తెరపైనా కలిగితే... ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.