ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తెరచుకవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో అయితే 50 శాతమే సిట్టింగ్. పెద్ద సినిమాలకు కాస్త ఇబ్బంది గానీ, చిన్న సినిమాలకు మాత్రం ఇది మంచి తరుణం. కానీ.. నిర్మాతలు మాత్రం సినిమాల్ని విడుదల చేయడానికి ఏమాత్రం ఉత్సాహం చూపించడం లేదు. దానికి కారణం.. టికెట్ రేట్లలో ఉన్న గందరగోళమే.
వకీల్ సాబ్ విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం... అర్థాంతరంగా ఓ జీవో తెచ్చిపడేసింది. టికెట్ రేట్లని సవరిస్తూ.. తీసుకున్న నిర్ణయం చిత్ర వర్గాల్ని ఓ కుదుపు కుదిపేసింది. టికెట్ రేట్లని అడ్డగోలుగా పెంచే వీలు లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఆ రేట్లకు సినిమాని విడుదల చేస్తే... నష్టాలు వస్తాయన్నది నిర్మాతల వాదన. సీ సెంటర్ లో బాల్కనీ టికెట్ రూ.50 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రేటుకి సినిమా ప్రదర్శించడం అంటే.. నష్టాల్ని కోరి తెచ్చుకున్నట్టే. అందుకే.. ఏపీలో సినిమాలు విడుదల చేసే విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నిర్మాతల కష్టాల్ని అర్థం చేసుకుని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో జీవో తెచ్చింది. టికెట్ రేట్లని పెంచే, లేదా.. తగ్గించే అధికారం తమ దగ్గరే ఉంచుకున్నామని, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రేట్లు ప్రకటిస్తామని తేల్చింది. అయితే ఇది మరింత గందరగోళకరమైన నిర్ణయం. టికెట్ రేట్లు ఎప్పుడూ ఒకేలా లేకపోతే ఎలా? ఓ సినిమాకి ఎక్కువ, ఓ సినిమాకి తక్కువ అయితే.. ప్రేక్షకులలో లేని పోని కన్‌ఫ్యూజన్లు మొదలవుతాయి. వీకెండ్ సినిమాలకు ఓ రేటని, వీక్ డేస్ లో మరో రేటు పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇలాగైతే.. వీకెండ్ సినిమా చూద్దామన్నవాళ్ల ఆశలకు కళ్లాలు వేసినట్టే. తొలి మూడు రోజుల్లో టికెట్ రేట్ పెంచి, మిగిలిన రోజుల్లో తగ్గించడం వల్ల పెద్ద సినిమాలకు నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్దిష్టత అవసరమన్న భావన వ్యక్తం అవుతోంది. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దలు మాట్లాడతారని, ఆ చర్చల అనంతరమే సినిమాల విడుదల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.