సినీ పరిశ్రమ కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన విషయం విదితమే. కొందరు సినీ ప్రముఖులు కరోనా వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు కూడా. కొందరు కరోనాతో పోరాటంలో విజయం సాధిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి. ఇక, కరోనా వైరస్ ఓ పక్క భయపెడుతున్నా, ఇతర సినీ పరిశ్రమలతో పోల్చితే తెలుగు సినీ పరిశ్రమ అత్యంత వేగంగా కోలుకుంటున్నట్లే కనిపిస్తోంది. చకచకా కొత్త సినిమాల ప్రకటనలు వస్తున్నాయి.
సినిమా హాళ్ళు ఎప్పుడు పూర్తిగా తెరుచుకుని, అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నప్పటికీ, ధైర్యంగా కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.. సినిమా షూటింగుల్లోనూ జోరు పెరిగింది. ఎన్ని జాగ్రత్తలు షూటింగ్ సందర్భంగా తీసుకుంటున్నప్పటికీ, కొందరు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అయితే, కరోనా సోకినా చాలామంది త్వరగానే కోలుకుంటుండడంతో కొంత భయం అయితే కరోనా పట్ల తగ్గిన మాట నిజం.
అయినాగానీ, కరోనా పట్ల అప్రమత్తంగానే వుంటోంది సినీ పరిశ్రమ. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, సంక్రాంతికే సినిమా హాళ్ళలో సినిమాలు హల్‌చల్ చేసేవి. ఇప్పుడేమో దీపావళి మీద కాస్తో కూస్తో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త సినిమాల ప్రకటనలు వేగంగా వస్తున్న దరిమిలా, 2021 తెలుగు సినీ పరిశ్రమకు ‘స్వర్ణయుగం’ కాబోతోందన్న చర్చ సినీ ప్రముఖుల్లో జరుగుతోంది.
సినిమా హాళ్ళు తెరచుకునేసరికి పెద్ద యెత్తున సినిమా రిలీజులకు రంగం సిద్ధమవుతుంది గనుక.. పరిశ్రమ వేగంగా కోలుకోవచ్చన్నది వారి అభిప్రాయం. ఈసారైనా పరిశ్రమ పెద్దల ఆశలు ఫలించాలని ఆశిద్దాం.