తెలుగు సినీ పరిశ్రమ, ప్రజలకెప్పుడు కష్టం వచ్చినా ముందుంటుంది. వరదలొచ్చినప్పుడూ, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడూ రకరకాల సేవా కార్యక్రమాల్ని చేపట్టింది తెలుగు సినీ పరిశ్రమ. పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చిన సేవా కార్యక్రమాలతోపాటు, హీరోలు తమకు తోచిన విధంగా వ్యక్తిగతంగా చేపట్టే సేవా కార్యక్రమాలు అదనం ఇక్కడ. ప్రపంచాన్ని కరోనా వైరస్ వెంటాడుతున్న వేళ, తెలుగు ప్రజల్ని ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. విరాళాలు ఇచ్చే విషయంలో ఒకర్ని ఇంకొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ మొత్తం విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
ప్రస్తుతానికి అత్యధిక విరాళం అందించింది రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాతి స్థానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది. ప్రభాస్ 4 కోట్లు, పవన్ కళ్యాణ్ 2 కోట్లు విరాళం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద హీరోలు, చిన్న హీరోలన్న తేడా లేకుండా విరాళాలతో సినీ ప్రముఖులు ముందుకొస్తుండడం అభినందించదగ్గ విషయం. వ్యక్తిగత విరాళాలే కాదు, పరిశ్రమ తరఫున ఓ కార్యక్రమం చేపట్టేందుకూ సినీ పరిశ్రమ సమాలోచనలు చేస్తోంది. అయితే, అందుకు ప్రస్తుత ఆందోళకర పరిస్థితులు సద్దుమణగాల్సి వుంటుంది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటూ సినీ ప్రముఖులు చేస్తున్న సూచనలకు మంచి స్పందన వస్తోంది ప్రజల నుంచి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విరాళాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో, కరోనాపై పోరాటంలో తెలుగు సినీ పరిశ్రమ తనదైన శౖలిలో ‘సత్తా’ చాటుతోందన్నమాట.