పవన్ కల్యాణ్ - రానా కలిసి నటిస్తున్న చిత్రం ఈమధ్యే.. సెట్స్‌పైకి వెళ్లింది. ఇది మలయాళ చిత్రం `అయ్యప్పయునుమ్ కోషియమ్` కి రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నాడు. అయితే తెర వెనుక దర్శకత్వ బాధ్యతలు కూడా త్రివిక్రమే నిర్వహిస్తున్నాడని, సాగర్ చంద్ర నామ మాత్రపు దర్శకుడని గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ మొదలైన రోజు.. చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది.
పవన్ సెట్లో అడుగుపెట్టిన క్షణాల్ని వీడియోగా మలచి, అభిమానుల కోసం విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియోలో.. త్రివిక్రమ్ హడావుడే ఎక్కువ కనిపించింది. దాంతో ఈ సినిమాకి దర్శకుడు సాగర్ చంద్రనా? త్రివిక్రమ్ నా? అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై మెల్లమెల్లగా త్రివిక్రమ్ ముద్ర పడుతుండడం సినీ జనాలూ గమనిస్తూనే ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి త్రివిక్రమ్ సినిమాగా మారిపోయే ప్రమాదమూ వుంది. త్రివిక్రమ్ సంభాషణలు రాస్తున్నాడంటే ఆ సినిమాపై ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ సినిమా, అందులోనూ మల్టీస్టారర్. పైగా.. మలయాళంలో క్లాసిక్ అనిపించుకున్న సినిమా. ఇప్పుడు దానికి తోడు త్రివిక్రమ్ ముద్ర. ఈ సినిమాపై అంచనాల భారం పెరిగిపోతోంది. బిజినెస్ పరంగా కావల్సినంత క్రేజ్ వచ్చినా.. పెరిగిన అంచనాల్ని అందుకోవడంలోనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం చిత్రబృందం అర్థం చేసుకుని, త్రివిక్రమ్ హడావుడి తగ్గించి, ఇది సాగర్ చంద్ర సినిమాగానే ప్రచారం చేసి, విడుదల చేస్తే బాగుంటుందన్నది సినీ వర్గాల అభిప్రాయం.