ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌లది సూపర్ హిట్ కాంబో. వీరిద్దరి నుంచి వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జట్టుకట్టబోతున్నారు. 'అల వైకుంఠపురములో'తో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఓ లైన్ ఎన్టీఆర్‌కి వినిపించడం జరిగిందట. దానికి ఎన్టీఆర్ కూడా 'ఓకే' అనేసినట్టు తెలుస్తోంది. 'అరవింద సమేత..' కాస్త సీరియస్ ఎమోషన్‌తో సాగిన సినిమా. అయితే.. ఈసారి ఆ సీరియస్ నెస్ ఏమీ లేకుండా, సరదాగా, హాయిగా సాగిపోయే సినిమా చేయాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
'అల.. వైకుంఠపురములో' కోసం త్రివిక్రమ్ చేసింది అదే. ఫన్ పార్ట్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాడు. ఆఖరికి క్లైమాక్స్‌ని కూడా పొయెటిక్‌గా తీశాడు. అదే ఫార్ములా ఎన్టీఆర్ విషయంలోనూ వర్కవుట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా యాక్షన్ డోసు వద్దని గట్టిగా చెప్పాడట. సో.. మరోసారి త్రివిక్రమ్ నుంచి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆశించొచ్చు.