సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. నందమూరి తారక రామారావు గారి జీవితంలోని చివరి రోజుల్లో జరిగిన కథాంశాల ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం మొదలైనప్పటినుండి ఎన్నో వివాదాలను ఎదుర్కొంటోంది. ఇటీవలే విడుదల తేదీ కూడా ప్రకటించి, తెలుగు దేశం పార్టీకి షాక్ ఇచ్చాడు వర్మ. ప్రస్తుత ఎన్నికల సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలైతే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఓ టీడీపీ కార్యకర్త ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ ని తెలంగాణా హైకోర్టు కొట్టివేసింది. 'భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేము. సినిమాలో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా ఉంటే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ లో సినిమా విడుదల చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా మా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు' అని తెలంగాణా అడ్వకేట్ జనరల్ తెలిపింది.
దీంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయ స్థానం. అలాగే, 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా విడుదలకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. మొదట మార్చి 22 న అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల.. ఇప్పుడు మార్చి 29 కి వాయిదా పడింది.