'ఎన్‌టిఆర్ బయోపిక్' విషయమై కొంత గందరగోళం నెలకొందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, స్వయంగా నందమూరి బాలకృష్ణ 'డ్యామేజ కంట్రోల్' చర్యలు ప్రారంభించారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ, టీడీపీ తరఫున ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిపై నిప్పులు చెరిగారు. దాంతో, 'ఎన్‌టిఆర్ బయోపిక్' విషయమై తెలంగాణ వ్యాప్తంగా కొంత గందరగోళం చోటు చేసుకుంది. సినిమాకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు ఆందోళనకు దిగే అవకాశం వున్నట్లు గుసగుసలు వినవస్తున్న సంగతి తెల్సిందే.
అధికార పార్టీ, తమపై బాలకృష్ణ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఒకింత గుస్సా అవడం సహజమే. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారట. సంక్రాంతికి 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' విడుదల కానున్న విషయం విదితమే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖరారైంది. మరోపక్క, ప్రమోషన్స్ మరింత జోరందుకోబోతున్నాయి. దాంతో, సినిమాకి ఎలాంటి ఇబ్బందులూ వుండకూడదని బాలయ్య భావిస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బాలకృష్ణకి సన్నిహిత సంబంధాలే వున్నాయి. కానీ, ఎన్నికల ప్రచారంలో కొంత బాలయ్య తన మీద తాను అదుపు కోల్పోయారు. అది రాజకీయంగానే చూడాలి తప్ప, ప్రభుత్వం పట్లగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పట్లగానీ తనకు వ్యతిరేకత లేదని ఇప్పటికే బాలయ్య, కేసీఆర్‌కి వివరణ ఇచ్చుకున్నారని సమాచారమ్. త్వరలోనే బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు కూడా తెలుపనున్నారట. అదే జరిగితే, 'ఎన్‌టిఆర్ కథానాయకుడు'కి టెన్షన్ తప్పినట్లే. ఈ సినిమాకి బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.