రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎప్పటి నుంచో వుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు నాట రాజకీయాలకు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే మఖ్యమంత్రి అయ్యారాయన. తమిళనాడులోనూ సినీ ప్రముఖులకు రాజకీయాలు కొత్త కాదు. ఎమ్‌జీఆర్, జయలలిత లాంటి వారు అక్కడి రాజకీయాలను శాసించారు. బాలీవుడ్ నటులు, కన్నడ సినీ ప్రముఖులు ఇలా సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు.
తాజాగా మరో సినీ నటుడు కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి, రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతను ఎవరో కాదు. విలక్షణ నటుడు ఉపేంద్ర, ఎక్కువగా డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఉపేంద్ర. అయినప్పటికీ అతనికి సెపరేట్‌గా తెలుగులోనూ అభిమానులున్నారు. 'కన్యాదానం', 'సన్నాఫ్ సత్యమూర్తి' తదితర సినిమాలతో స్టెయిట్‌గానూ తెలుగు సినిమాల్లో నటించాడు ఉపేంద్ర.
తాజాగా 'కర్ణాటక ప్రజ్ఞావంత్ జనతా పక్ష' అనే పార్టీని స్థాపించాడు. అందరికీ విద్యనందించడం, అందరికీ ఆరోగ్య భీమానందించడం తమ రాజకీయ పార్టీ అజెండా అని ఉపేంద్ర పేర్కొన్నారు. మరో పక్క తమిళనాడులో కమల్‌హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ప్రజారాజ్యం పార్టీతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా, ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోవడంతో ఆ తర్వాత పవన్ రాజకీయలాకు దూరమయ్యాడు. తిరిగి 2014 లో సొంతంగా 'జనసేన' పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేయనుంది.