మెగా కాంపౌండ్ నుండి వచ్చి, తొలి సినిమా నుండీ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ, విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇప్పుడు లవ్‌స్టోరీలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. వరుసగా 'ఫిదా', 'తొలిప్రేమ' సినిమాలతో కెరీర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఈ తరుణంలో వరుణ్ తదుపరి చిత్రం కోసం మళ్లీ ప్రయోగాల బాట పడుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 'తొలిప్రేమ'తో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తర్వాత యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
రానాతో 'ఘాజీ' అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కించిన డైరెక్టరే ఈ సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తేజ్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రేంటో తెలుసా? ఆస్ట్రోనాట్. అసలు జలాంతర్గామి నేపథ్యంలోనే ఇంతవరకూ సినిమా రాలేదనీ, అలాంటి గొప్ప ప్రయోగానికి సంకల్ప్ 'ఘాజీ'తో శ్రీకారం చుట్టాడనీ, ఆ సినిమా విషయమై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు సంకల్ప్. ఇప్పుడు వరుణ్‌తో తెరకెక్కించబోయే చిత్రం 'స్పేస్' నేపథ్యంలో ఉండబోతోంది. అంటే ఇది కూడా ఖచ్చితంగా ప్రయోగాత్మక చిత్రమే.
సో వరుణ్ లవర్ బోయ్ నుండి మళ్లీ ప్రయోగాల బాట పట్టనున్నాడని తెలియవస్తోంది. ఏది ఏమైనా వరుణ్ ఒకే ట్రాక్‌లో వెళ్లకుండా, ట్రాక్స్ ఛేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈ రకంగా వరుణ్ మెగా ఫ్యామిలీలో పూర్తి కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కాకుండా, విలక్షణ నటుడు అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మెగా అభిమానులకు ఇది సంతోషించదగ్గ విషయమే.