అఖిల్, హలో తరవాత అక్కినేని వారసుడు అఖిల్ నుంచి వస్తున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. తొలి రెండు చిత్రాలూ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు అఖిల్. ఈ సినిమాపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కాబోతోంది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా... సెన్సార్ బోర్డు యూ బై ఏ ధృవీకరణ పత్రం జారీ చేసింది.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం... తొలి సగం.. వినోదాత్మకంగా సాగిపోయిందట. ఎక్కువ సన్నివేశాలు అఖిల్ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేయడానికి వాడుకున్నారని, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, పాటలు రిచ్‌గా వచ్చాయని చెబుతున్నారు. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ డ్రైవ్‌గా సాగిందట. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా వచ్చాయని, తమన్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని, మొత్తానికి అఖిల్‌కి ఈసినిమాతో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే... ఈ అక్కినేని వారసుడికి తొలి విజయం అందినట్టే.