డిసెంబరు 14 నుంచి `ఎఫ్ 3` షూటింగ్ మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు... అనిల్ రావిపూడి. ఈ సినిమా కథెప్పుడో రెడీ. హీరోల డేట్లు సర్దుబాటు కాక.. ఇప్పటి వరకూ ఆగింది. ఎట్టకేలకు ఈ సినిమా ముందుకు సాగుతుందన్న తరుణంలో... `ఎఫ్ 3`కి మరో స్పీడ్ బ్రేకర్ పడినట్టు, ఈ సినిమా నుంచి వరుణ్ తేజ్ తప్పుకోవాలని చూస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పారితోషికం విషయంలో దిల్ రాజుకీ, వరుణ్ తేజ్‌కీ మధ్య లెక్కలు కుదర్లేదని, వెంకటేష్ తో సరి సమానంగా వరుణ్ తేజ్ కూడా పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని, అనిల్ రావిపూడి మరో ఆప్షన్ వెదుక్కోక తప్పదని వార్తల సారాంశం.
అయితే... వరుణ్ పారితోషికాల పేచీతో.. ఇలాంటి ఓ మంచి ఛాన్స్ ని వదులుకుంటాడని అనుకోలేం. ఎందుకంటే.. ఎఫ్ 2 అనేది వరుణ్‌కెరీర్‌లోనే పెద్ద హిట్. ఎఫ్ 3 కూడా హిట్టయితే.. ఈ సిరీస్ ఇలానే కొనసాగడం ఖాయం. ఇలాంటి ఫ్రాంజైజీని వరుణ్ లాంటి హీరో వదులుకోడు. పైగా... ఈ సినిమా కోసం వరుణ్ పెద్దగా కష్టపడే అవసరం, అవకాశం కూడా లేదు. కామెడీ టైమింగ్ పట్టుకుంటే చాలు. బాడీ బిల్డింగులు, రిస్కీ ఫైట్లూ అవసరం లేదు.
వరుణ్ కూడా.. ఎఫ్ 3 చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పారితోషికం పేరుతో పేచీలు పెడుతున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదనిపిస్తోంది. చిత్రబృందం కూడా.. ``వెంకీ - వరుణ్‌లతోనే `ఎఫ్ 3` రాబోతోంది. ఈ విషయంలో ఎలాంటి మార్పుల్లేవు..`` అని స్పష్టంగానే చెబుతోంది. సో.. `ఎఫ్ 3`లో హీరోల మార్పిడి.. నిజం కాదన్నమాట.