ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. ఓవైపు చిరంజీవి.. మరో వైపు నందమూరి బాలకృష్ణ. ఇద్దరూ పెద్ద హీరోలే. దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తున్నవాళ్లే. వీరిద్దరి సినిమాలూ ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్యగా, బాలయ్య - వీర సింహారెడ్డిగా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు బరిలో నిలిచే అవకాశం ఉన్నా - ప్రధానమైన పోటీ మాత్రం చిరు - బాలయ్యల మధ్యే. ఈసారి విచిత్రం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల్నీ మైత్రీ మూవీస్ సంస్థే నిర్మించింది. అందుకే రూపాయి వచ్చినా - పోయినా..అంతా మైత్రీకే.
కాకపోతే... సంక్రాంతి విడుదల విషయంలో బాలయ్యకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దానికీ కారణాలు, సాక్ష్యాలూ ఉన్నాయి. సంక్రాంతి బరిలో రెండు సినిమాలున్నా - ఎక్కువ థియేటర్లు చిరంజీవి సినిమాకే కేటాయిస్తున్నారని, బాలయ్యకు థియేటర్లలో కోత విధిస్తున్నారన్నది ప్రధాన వాదన. అంతే కాదు.. మంచి థియేటర్లు చిరు సినిమాకి ఇచ్చి, ఓ మోస్తరు థియేటర్లు బాలయ్య సినిమాకి ఇస్తున్నార్ట. విశాఖలాంటి ప్రధాన నగరాల్లో బాలయ్య సినిమాకి తక్కువ థియేటర్లు ఇస్తున్నారని, పైగా.. మెయిన్ థియేటర్లన్నీ చిరంజీవి సినిమాకే వెళ్లిపోతున్నాయని బాలయ్య ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంక్రాంతి బరిలో `వారసుడు` ఉంటే... ఇంకా ప్రమాదం. ఎందుకంటే అది దిల్‌రాజు సినిమా. ఆయన చేతిలో చాలా థియేటర్లు ఉంటాయి. అవన్నీ తన సినిమాకే ఇచ్చుకొంటారు. అప్పుడు చిరు, బాలయ్య సినిమాలకు అసలు థియేటర్లే దొరకని పరిస్థితి. అప్పుడు బాలయ్యకు మరింత అన్యాయం జరుగుతోందని ఊహిస్తున్నారు. ఈ విషయం బాలయ్య దగ్గరకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. బాలయ్య పంపిణీ, థియేటర్ల విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోడు. మరి ఈసారి... ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.