'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ కొట్టి, అదే ఏడాది 'వెంకీ మామ' అంటూ మరో బ్లాక్ బస్టర్‌తో సత్తా చాటిన విక్టరీ వెంకటేష్ మాంచి ఊపుతో ఓ తమిళ రీమేక్‌ని ఓకే చేసేసిన సంగతి తెలిసిందే. అదే 'అసురన్' రీమేక్. తనతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల చేతికి ఈ రీమేక్ అప్పగించాడు వెంకీ. శ్రీకాంత్ తనదైన శైలిలో ఈ రీమేక్‌లో అక్కడక్కడా చిన్నా చితకా మార్పులు చేసి, స్క్రిప్టు సిద్ధం చేసి పెట్టాడు. మరో రెండు రోజుల్లో సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. రాయలసీమ నేటివిటీలో ఈ సినిమా తెరకెక్కనుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాలో వెంకటేష్ పేరు 'నారప్ప'. 'సిద్దప్ప' కాదండీ బాబూ.. 'నారప్ప'. 'చూడప్పా సిద్దప్పా అని 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ యమా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 'అప్పా' అనేది సీమ నేటివిటీని ప్రతిబింబిస్తుంటుంది. సీమ పెద్ద అయిన వెంకటేష్‌ది 'నారప్ప' పేరు కావడంతో, ఆ పేరునే సినిమాకి టైటిల్‌గా పెట్టాలనుకుంటున్నారట. అయితే, సిద్దప్పలా వెంకీ నారప్పా కూడా పాపులర్ అవుతుందా.? క్యాచీగానే ఉంది కాబట్టి, కనెక్ట్ అయిపోవచ్చు. అయితే, ఈ టైటిల్‌పై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. తొలి షెడ్యూల్ షూటింగ్ అనంతపురంలో స్టార్ట్ కానుందనీ చిత్ర యూనిట్ ద్వారా అందుతోన్న సమాచారం. ఈ సినిమాలో వెంకీకి భార్య పాత్రలో ప్రియమణి నటిస్తోంది. సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.