తమ అభిమాన హీరోల జోలికి వస్తే అభిమానులు కొంచెం ఘాటుగా స్పందించడం షరా మామూలే. అయితే తమిళ హీరో విజయ్ అభిమానుల నుండి ఈ మధ్య కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ధన్య రాజేంద్రన్ అనే జర్నలిస్ట్ విజయ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నోటికొచ్చినట్లు తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై హీరో విజయ్ స్పందిస్తూ, అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశం పంపించాడు. 'మహిళల పట్ల నాకు గౌరవం ఉంది. సినిమా నచ్చకపోతే బాగాలేదు అని చెప్పే స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది. కాబట్టి మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదనీ' విజయ్ పోస్ట్ చేశారు. అసలింతకీ ధన్య రాజేంద్రన్ ఏమన్నారంటే, షారుఖ్ నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం అందుకోలేకపోయింది అది వేరే విషయం కానీ ఈ సినిమా చూసి ధన్య రాజేంద్రన్ కొన్నేళ్ల క్రితం విజయ్ హీరోగా వచ్చిన 'సురా' కంటే ఈ సినిమా దరిద్రంగా ఉందని ట్వీట్ చేసింది. ఈ ట్వీటే ఇప్పుడు దుమారం లేపింది. విజయ్ అభిమానుల్ని హర్ట్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు నెగిటివ్‌గా కామెంట్ల వరద ఉప్పొంగింది విజయ్ ఫ్యాన్స్ నుండి. దాంతో ఆమె పోలీసులనాశ్రయించక తప్పలేదు. విషయం ఇంతవరకూ రావడంతో విజయ్ సోషల్ మీడియాలో అలా స్పందించాల్సి వచ్చింది. అదీ సంగతి.