'నోటా' సినిమా రిలీజ్ టైంలో ఎన్టీఆర్ అభిమానులకు, విజయ్ దేవరకొండ అభిమానులు రౌడీస్‌కీ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్దమే జరిగింది. 'అరవింద'కు పోటీగా సరిగ్గా ఆరు రోజుల ముందు 'నోటా' సినిమాని విజయ్ రిలీజ్ చేయడమే దీనికి కారణం.
నిజానికి రిలీజ్ డేట్ నిర్ణయించేది నిర్మాత. కానీ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించి ఆ పోల్‌కి భిన్నంగా విజయ్ అక్టోబర్ 5న సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ చేశాడు. అయితే వాస్తవానికి ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పోటీ పడేంత ఈక్వేషన్స్ ఇద్దరి మధ్యా లేవు. కానీ అభిమానులు అలా ఫిక్సయ్యారు. ఓ దశలో విజయ్ దేవరకొండ ముందు ఎన్టీఆర్ బలాదూర్ అంటూ రౌడీస్ తేల్చేశారు. 'నోటా' సినిమా ఫెయిలైంది. 'అరవింద..' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో 'అరవింద..' కు వ్యతిరేకంగా విజయ్ దేవరకొండ రౌడీస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెర లేపారు. 'నోటా' సినిమా రిలీజ్ ముందు రోజు ఎన్టీఆర్ అభిమానులు చేసింది ఇదే. ఆ నెగిటివ్ ప్రచారం 'నోటా'ని దెబ్బ తీసిందని భావిస్తున్న 'రౌడీస్' అరవింద సినిమాకి నెగిటివ్ టాక్ బీభత్సంగా స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే, విజయ్ దేవరకొండ నిన్న ట్విట్టర్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించినదే అని గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఫైట్ ఎక్కడి దాకా వెళ్తుందో.. రౌడీస్ దెబ్బ అరవింద సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలిక.