'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ జోష్‌లో ఉన్న పూరీ జగన్నాధ్ తదుపరి చిత్రం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నాడన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఫ్రెష్ అప్‌డేట్ ప్రచారంలోకి వచ్చింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్, ఛార్మీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఛార్మి 'ఫైటర్' అనే టైటిల్‌ని రిజిస్టర్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ టైటిల్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ సినిమా కోసమే అని ఫ్యాన్స్ అనుమానం. అంటే, 'కామ్రేడ్' తదుపరి 'ఫైటర్'గా మారనున్నాడన్న మాట. పెద్దగా సస్పెన్స్ మెయింటైన్ చేయడం లేదు పూరీ. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేస్తాడులెండి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని టాలీవుడ్‌కి తీసుకురావాలన్న యోచనలో ఉన్నాడట పూరీ.
పూరీ బోణీ చాలా మంచిది. పూరీ బోణీ కొట్టిన హీరోనే నేటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో అన్నీ కుదిరితే, జాన్వీ కపూర్‌కి తెలుగులో పూరీ గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తాడనడం అతిశయోక్తి కాదు. కాకపోతే, జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల్ని వదిలిపెట్టి రావడం కుదరని పని. కానీ, పూరీ వన్స్ సెట్స్‌లో అడుగు పెట్టాడంటే చాలు, లాగ్ చేయకుండా పని పూర్తి చేసేస్తాడు. మరి జాన్వీ కోసం పూరీ వెయిట్ చేస్తాడా.? లేక, ఇప్పుడు కాదులే అని వేరే హీరోయిన్‌తో సరిపెట్టేస్తాడా.? చూడాలిక.