విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలపై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదలను కొన్ని కారణాలతో పోస్ట్‌పోన్ చేశారనీ, మే 31న రావాల్సిన 'డియర్ కామ్రేడ్', జూన్ 13న విడుదల కానుందనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, మే 31న సూర్య నటించిన 'ఎన్జీకే' చిత్రం విడుదల కానుంది.
తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ ఉన్న దర్మిలా ఎందుకొచ్చిన రిస్క్‌లే అనుకుని విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గాడట.. ఇదీ ప్రచారంలో ఉన్న కథనం. అయితే రిస్క్‌లు చేయడంలో ముందుంటాడు విజయ్ దేవరకొండ. రిలీజ్ కాకుండానే డిజిటల్ ప్రింట్ మొత్తం లీకైపోయిన 'ట్యాక్సీవాలా' సినిమాని డేరింగ్‌గా రిలీజ్ చేసి, సంచలన విజయం అందుకున్న హీరో విజయ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' చిత్రంపై చాలా అంచనాలున్నాయి. అందులోనూ విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా క్రేజీ పెయిర్ ఈ సినిమాలో జోడీ కడుతోంది.
విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అన్నింటి కన్నా ముఖ్యంగా తెలంగాణా పోరడు విజయ్ దేవరకొండ తొలిసారి ఈ సినిమా కోసం ఆంధ్రా బుల్లోడి అవతారమెత్తాడు. అచ్చమైన కోస్తా కుర్రోడిలా గోదావరి జిల్లా యాసలో డైలాగులు పలకనున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఆశక్తికరమైన పాయింట్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశాలే. సో కామ్రేడ్ వెనక్కి తగ్గే ప్రశక్తే లేదనుకోవాలి. మరి ఈ గాసిప్ నిజమా కాదా.? తెలియాలంటే మన 'రౌడీ' స్పందించాల్సిందే.