తమిళంలో విడుదలైన 'మెర్సల్' ఇప్పటికే 150 కోట్లు సాధించినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా తమిళ సినీ ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంతవరకూ విడుదల కాలేదు. ఈ వారం విడుదలవుతుందన్న దానిపై సమాచారం కూడా లేదు. అయితే ఒకవేళ ఈ సినిమా తెలుగులో విడుదలై ఉంటే కనుక పెద్ద హిట్ అయ్యేది. అయితే మరో పక్క ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలున్నాయనీ టాక్ నడుస్తోంది. అందుకే ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదనీ ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయంలో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ సినిమా విడుదల కాగానే వివాదాల్లోకెక్కింది. సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు చాలా ఉన్నాయంటూ పలు వివాదాలు దుమారం లేపుతున్నాయి. అయినప్పటికీ సినిమా సక్సెస్‌ని మాత్రం ఆపడం ఎవ్వరి తరం కావట్లేదు. ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ గవర్నమెంట్ నుండి కూడా చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ ఈ సినిమాకి జనం నుండీ, సినీ పరిశ్రమ నుండీ బాగా సపోర్ట్ లభించింది. కంటెన్ట్ బావుంటే సినిమాని ఎవ్వరూ ఆపలేరనడానికి ఈ సినిమా ఓ నిదర్శనం. ప్రస్తుతం గవర్నమెంట్‌లో తలెత్తుతున్న లోపాల్ని, వాస్తవాలుగా ఈ సినిమాలో చూపించారు. అలాగే వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలను కూడా ఈ సినిమా ద్వారా చూపించారు. అదే ప్రజలకి నచ్చింది. కానీ ప్రభుత్వానికి నచ్చదు కదా .అందుకే ఇన్ని వివాదాలు. ఈ వివాదాల కారణంగా ఈ సినిమా గురించి నేషనల్ మీడియా కూడా మాట్లాడుతోంది.