'పుష్ప' సూపర్ డూపర్ హిట్టయిపోవడంతో.. అందరి దృష్టీ,.. పార్ట్ 2పై పడింది. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు సుకుమార్. స్క్రిప్టు అనుకొన్నది అనుకొన్నట్టు వచ్చేంత వరకూ.. సెట్స్ పైకి వెళ్లకూడదని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. పెరిగిన అంచనాల్ని తట్టుకొనేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు. అందులో భాగంగానే కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
'పుష్ప 2' లో కొత్త పాత్రలేం ఉండవని.. పుష్ప 1 విడుదల సమయంలో చెప్పాడు సుకుమార్. అయితే.. ఇప్పుడు మనసు మార్చుకొన్నాడు. కొత్త పాత్రలు వస్తే.... కొత్త తరహా ఎమోషన్ పుట్టించవచ్చని భావిస్తున్నాడు. అందుకే.. పుష్ప 2 కోసం ఓ సరికొత్త, పవర్ఫుల్ పాత్రని సృష్టించినట్టు టాక్. ఆ పాత్రలో... విజయ్ సేతుపతి కనిపించనున్నాడని తెలుస్తోంది.
విజయ్ సేతుపతి క్యారెక్టర్ పూర్తిగా నెగిటీవ్‌గా ఉంటుందని, దాంతో... పుష్ప పాత్ర మరింత హైలెట్ అవుతుందన్నది సుకుమార్ వ్యూహం. ఇప్పటికే.. సునీల్, ఫహద్ ఫాజిల్ రూపంలో ఈ సినిమాలో ప్రతినాయకులకు కొదవ లేకుండా పోయింది. ఇప్పుడు విజయ్‌సేతుపతి కూడా కలిస్తే... విలనిజం ఓ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది. ఎప్పుడైతే విలనిజం పెరిగిందో.. హీరోని మరింత ఎలివేట్ చేయడానికి ఛాన్స్ దొరికినట్టే. అందుకే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని టాక్.