ఒకప్పుడు వైభోగంగా బతికిన నటీనటులు, ఆ తరవాతి కాలంలో దుర్భర జీవితాన్ని అనుభవించడం చూస్తూనే ఉన్నాం. డబ్బుల్ని పొదుపుగా, సవ్యంగా ఎలా వాడుకోవాలో తెలియనివాళ్ల జీవితాలన్నీ చల్లా చెదురైపోయాయి. చేతిలో డబ్బులున్నప్పుడు జల్సాలు చేసి, అవి అయిపోయిన వెంటనే అప్పుల పాలైనవాళ్లెంతోమంది.
అయితే.. తన జీవితం మాత్రం అలా కాకుండా విజయ శాంతి ఇచ్చిన సలహానే కాపాడింది అంటున్నారు వై. విజయ. 80, 90 దశకంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకున్న వై.విజయ చేతిలో ఇప్పుడు సినిమాలు ఏమీ లేవు. సీరియళ్లూ చేయడం లేదు. కానీ ఆమె బతుకు బండి హాయిగా గడిచిపోతోంది. అందుకు కారణం విజయశాంతి ఇచ్చిన సలహానే. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వైవిజయ ప్రస్తావించారు.
"డబ్బులు చేతిలో ఉన్నప్పుడే ఓ షాపింగ్ మాల్ కట్టుకో.. అది నీకు భవిష్యత్తులో పనికొస్తుంది అని విజయశాంతి ఒకప్పుడు సలహా ఇచ్చింది. ఆ సలహాతోనే చెన్నైలో ఓ షాపింగ్ మాల్ కట్టాను. ఆ అద్దె డబ్బులతో ఇప్పుడు జీవితం హాయిగా సాగిపోతోంది" అని వైవిజయ చెప్పారు. 'నిండు హృదయాలు' చిత్రంతో అరంగేట్రం చేసిన వై. విజయ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించారు.