'బాహుబలి' వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కథని రాసింది ఎవరో తెలుసు కదా. స్వయానా రాజమౌళి తండ్రిగారైన విజయేంద్రప్రసాద్. దాదాపుగా రాజమౌళి చిత్రాలకు ఈయనే కథలు రాస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా ప్రముఖ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథలు రాశారు. బాలీవుడ్ రికార్డు హిట్స్‌లో ఒకటైన 'బజరంగీ భాయీజాన్' చిత్రానికి కూడా కథను రాసింది ఈయనే. షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రానికి కూడా విజయేంద్రప్రసాదే కథనందించారనీ సమాచారమ్.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈయన ఎవరి కోసం కథ రాస్తున్నారంటారా? ఇంకెవరి కోసం అయ్యుంటుందిలే, 'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ మల్టీస్టారర్ ఎన్టీఆర్ - చరణ్ సినిమా కోసమే అయ్యుంటుంది అనుకుంటున్నారు కదా. అయితే తప్పులో కాలేసినట్లే. ఆ కథ ఎలాగూ ఉంటుందిలెండి. అయితే ఈయన ఓ కమెడియన్ కోసం కథని సిద్ధం చేస్తున్నారట. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' చిత్రాలతో ఇటీవలే కమెడియన్ నుండి హీరోగా ప్రమోషన్ అందుకున్న సప్తగిరి కోసం విజయేంద్రప్రసాద్ కథని రెడీ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని స్వర్ణ సుబ్బారావు తెరకెక్కిస్తున్నారట. కమెడియన్‌గా తనదైన శైలిలో ఆకట్టుకున్న సప్తగిరి హీరోగానూ తొలి రెండు సినిమాలతో మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథతో వస్తున్నాడన్న మాట కూసింత ఆశ్చర్యం కలిగించినా, సప్తగిరి ఈ సారి ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటాడనిపిస్తోందంటున్నారు ఫిల్మ్ వర్గాలు. చూడాలి మరి. ఇది జస్ట్ గాసిప్ మాత్రమేనా? లేక నిజంగానే విజయేంద్రప్రసాద్, సప్తగిరి కోసం కథ రాశారా అనేది తేలాల్సి ఉంది.