'వినయ విధేయ రామ' చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. సాధారణంగా డిజాస్టర్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా సంగతి అంతే ఇక. డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది మార్నింగ్ షో పడక ముందే డిజాస్టర్ టాక్ వచ్చిందంటే 'వినయ విధేయ రామ' సినిమా సంగతి ఇంక అంతే అనుకున్నారంతా. సోషల్ మీడియాలో కూడా ధియేటర్స్ ఖాళీ అనే అప్‌డేట్ కనిపించింది. దాంతో ఆడియన్స్ వెనక్కి తగ్గుతారనుకున్నారు. కానీ ఇంత నెగిటివిటీతోనే రామ్‌చరణ్ తొలిరోజు 26 కోట్లు కొల్లగొట్టాడు.
ఓ డిజాస్టర్ మూవీకి ఓపెనింగ్స్ ఈ స్థాయిలో అంటేనే ఆశ్చర్యం. అంతేకాదు రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లతో రామ్‌చరణ్ బయటపడ్డాడు. రెండో రోజు 'ఎఫ్ 2' విడుదలైంది. అంటే శనివారం. ఈ సినిమాకి ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఓ సూపర్ హిట్ మూవీ ముందుండి కూడా, డిజాస్టర్ టాక్ మూవీకి వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఇక ఇంత నెగిటివిటీతో ఉన్న మూవీ మూడో రోజుకు అంటే సండేకి పూర్తిగా ఖాళీ అయిపోవాలి. కానీ సండే కూడా ఫర్వాలేదనిపించింది.
హిట్టు సినిమాకి వచ్చిన వసూళ్లు ఇవి అనలేం కానీ, 'వినయ విధేయ రామ'కు లాభాలు తెచ్చే పరిస్థితి కాదు. నష్టాలు తగ్గించే సినిమా మాత్రమే. మరో వైపు సోషల్ మీడియాలో అభిమానుల కొట్లాట జరుగుతూనే ఉంది. తాజా అంచనాల ప్రకారం 70 కోట్ల దాకా ఈ సినిమా వసూళ్ళను సాధించే అవకాశం వుందట. అదే నిజమైతే, డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, రికార్డు వసూళ్ళను సంపాదించిన సినిమాగా వినయ విధేయ రామ సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లే.