స్వతహాగా టాలీవుడ్ వివాదాలకు దూరంగా ఉంటుంది. తమిళ, హిందీ పరిశ్రమలతో పోలిస్తే.... ఇక్కడ కాస్త ఆరోగ్యకరమైన వాతావరణమే కనిపిస్తుంటుంది. అయితే అప్పుడప్పుడూ ఏదో ఓ రూపంలో వివాదం చుట్టుముట్టడం, కొన్ని రోజులు వార్తల్లో నిలవడం.. కాస్త కామన్‌గా మారిందిప్పుడు. 2018లోనూ కొన్ని వివాదలు టాలీవుడ్‌లో దుమారం రేపి, టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా నిలిచాయి.
ఈ యేడాది 'కాస్టింగ్ కౌచ్' వివాదం టాలీవుడ్‌లో సెగలు రేపింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించింది. ఈ విషయమై... టీవీలో డిబేట్లు, ఫేస్ బుక్‌లో హాట్ టాపిక్కులు నడిచాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ కథానాయికలు, కథానాయకులు, హీరోలు, నిర్మాతలూ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించాల్సి వచ్చింది. 'మా' సభ్యత్వం కోసం ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న ప్రదర్శన, ఆ తరవాత జరిగిన పరిణామాలు ఆసక్తిని కలిగించాయి. చివరికి మా దిగి వచ్చి శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చింది.
కాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పవన్‌కల్యాణ్‌ని శ్రీరెడ్డి తిట్టడం, ఆ తరవాత పవన్ కల్యాణ్ ఛాంబర్‌కి వచ్చి హడావుడి చేయడం మీడియా దృష్టిని బాగా ఆకర్షించాయి. టాలీవుడ్ హీరోలంతా కలసి అన్నపూర్ణ స్డూడియోలో మీటింగు కూడా పెట్టుకున్నారు. కొన్ని టీవీ ఛానళ్లు ప్రవర్తిస్తున్న తీరుపై హాట్ హాట్ గా చర్చ సాగింది. 'మీటూ' ఉద్యమం తమిళ పరిశ్రమని కుదిపేస్తే ఆ సెగలు టాలీవుడ్‌కీ తాకాయి.
మొత్తానికి 2018 హాట్ హాట్‌గా సాగింది. రోజూ.. ఏదో ఓ రూపంలో ఎవరో ఒకరు మాటల ద్వారానో, చేష్టల ద్వారానో.. టాలీవుడ్ మీడియాకు కావల్సినంత మసాలాని అందించారు.