విశాల్ కెరీర్‌లోనే మర్చిపోలేని విజయం `డిటెక్టీవ్`తో దక్కింది. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు `డిటెక్టీవ్ 2` కూడా మొదలైంది. `డిటెక్టీవ్`కి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులే ఈ సీక్వెల్‌లోనే ఉన్నారు. మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ.. సినిమా షూటింగ్ మధ్యలోనే విశాల్‌కీ, దర్శకుడికీ మధ్య విబేధాలు మొదలయ్యాయి. దాంతో... మిస్కిన్ ఈసినిమాని వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దాంతో విశాల్ ఆపధర్మ దర్శకుడిగా అవతారం ఎత్తినట్టు సమాచారం. బడ్జెట్ విషయంలోనే విశాల్ కీ, మిస్కిన్‌కి మధ్య గొడవలు మొదలయ్యాయని, అందుకే మిస్కిన్ తప్పుకున్నాడని తెలుస్తోంది. 40 కోట్లతో పూర్తవ్వాల్సిన సినిమా ఇది.
సగం సినిమా అవ్వకుండానే ఆ నలభై కోట్లు అయిపోయాయని తెలుస్తోంది. దర్శకుడు మరో 40 కోట్లు డిమాండ్ చేశాడని, అందుకే ఆయన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. దీనిపై మిస్కిన్ కూడా వ్యంగ్యంగా స్పందించాడు. ''నేను 40 కోట్లు అడగలేదు. 400 కోట్లు అడిగా. ఓ సన్నివేశంలో శాటిలైట్ నుంచి విశాల్ భూమ్మీదకు దూకాలి. అందుకోసం వంద కోట్లు ఖర్చయ్యింది'' అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి విశాల్ - మిస్కిన్ గొడవలు పెద్దవయ్యాయి. మరి వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.