ఈమధ్య మలయాళ సినిమాలపై మన వాళ్ల ఫోకస్ మరింత పెరిగింది. ఓటీటీ వల్ల ఆయా సినిమాలన్నీ త్వరగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. మంచి సినిమాలు మరింత త్వరగా చేరువవుతున్నాయి. వాటి గురించి చర్చ కూడా జోరుగానే సాగుతోంది. అలా ఈ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించిన మలయాళ చిత్రం... కప్పెల. చిన్న సినిమా. స్టార్లెవరూ లేరు. కానీ ఈ స్టోరీని డీల్ విధానం, అందులోని మలుపులూ సినీ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. తరుణ్ భాస్కర్ ఈ సినిమాని చూసి ఫ్లాటైపోయాడు. ఈ సినిమా గురించి తరుణ్ చేసిన విశ్లేషణ - కొంతమంది తెలుగు సినీ హీరోలపై విమర్శనా బాణంలా తాకింది. అంతగా ఈసినిమా ప్రభావం చూపించింది.
మలయాళ సినిమాలంటే మక్కువ చూపించే తెలుగు నిర్మాతలు ఆగుతారేంటి? ఎప్పుడో ఈ సినిమా కొనేశారు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ దగ్గర ఈసినిమా రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. కొత్తవాళ్లతో వెళ్దామా? లేదంటే తెలిసిన మొహాలతో నడిపిద్దామా? అనే మీమాంసలో ఉంది నిర్మాణ సంస్థ. ప్రస్తుతానికైతే విశ్వక్ సేన్ పేరుని పరిశీలిస్తున్నట్టు భోగట్టా. అయితే ఇందులో మరో హీరో కూడా ఉంటాడు. ఆ పాత్రకీ ఓ యువ హీరోనే తీసుకోవాలి. అయితే ఇద్దరూ కొత్తవాళ్లే. లేదంటే.. ఇద్దరూ కొత్త మొహాలే. అదీ... సితార ప్లాను. దీంతో పాటు `ఓ మై కడవులే` అనే ఓ తమిళ రీమేక్‌లో కూడా విశ్వక్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ రీమేక్ రైట్స్ కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్ దగ్గరే ఉన్నాయి.