బాలీవుడ్ నటుడు వివేవక్ ఒబెరాయ్ తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విలక్షణ నటుడు గతంలో హీరోగానూ నటించాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సినిమా 'క్రిష్ 3'లో విలన్‌గా మెప్పించాడు. తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన 'వివేగం'లో కూడా విలన్‌గా నటించి మెప్పించాడు. తెలుగు ప్రేక్షకులకు 'రక్త చరిత్ర' సినిమాతో సుపరిచితుడే. ఆ సినిమాలో పరిటాల రవి పాత్రలో కనిపించాడు.
ఇప్పుడీ వివేక్ ఒబెరాయ్ ఓ బయోపిక్‌లో కనిపించబోతున్నాడు. ఆ బయోపిక్ పేరు 'పి.ఎం.నరేంద్రమోదీ'. రీల్ లైఫ్ మోడీగా ఇందులో వివేక్ ఒబెరాయ్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 7న ఫస్ట్‌లుక్ విడుదలవుతుంది. 15 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
మరో పక్క తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ 'ది ఐరెన్ లేడీ' రూపొందుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా ఆల్రెడీ రూపొందింది. విడుదలకు సిద్ధమవుతోంది. సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖుల బయోపిక్స్‌తో పాటు, పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్‌కీ మంచి డిమాండ్ ఉందిప్పుడు. ఎన్నికల సీజన్‌లో ఈ బయోపిక్స్ ఆయా పార్టీలకు ఎంత లాభమో, ఎంత నష్టమో వేచి చూడాలి మరి.