అర్జున్ రెడ్డి లాంటి క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ సినిమా తరవాత అందరి కళ్లూ... సందీప్ రెడ్డి వంగాపై పడ్డాయి. స్టార్ హీరోలు సైతం తనతో కలిసి ప్రయాణించడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇప్పుడు వాళ్లంతా ఒకొక్కరుగా దూరం అవుతున్నారు. మహేష్ బాబుతో సందీప్ ఓ సినిమా చేస్తాడని చెప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తరవాత ప్రభాస్ పేరు బలంగా వినిపించింది. రాధాకృష్ణతో సినిమా పూర్తయిన తరవాత సందీప్ రెడ్డి సినిమా ఓకే అవుతుందనుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త సినిమాకి సంబంధించిన వార్త బయటకు వచ్చేసింది. ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తాడు. అంటే 2022 వరకూ ప్రభాస్ దొరకడు.
సో.. సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా లేనట్టే. అర్జున్ రెడ్డి హిట్టు తరవాత తనకు వచ్చిన అవకాశాల్ని సందీప్ రెడ్డి సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ వెంటనే మరో బాలీవుడ్ సినిమాకి ప్లాన్ చేశాడు. మరి ఎందుకనో అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా కూడా చేయి జారిపోయినట్టే. ఓ యంగ్ హీరోని పట్టుకుని, తనదైన స్టైల్‌లో సినిమా తీయడం తప్ప, మరో ఆప్షన్ లేకుండా పోయింది. మరి సందీప్ ఏం చేస్తాడో చూడాలి.