దక్షిణాది నుంచి మరో పాన్ ఇండియా స్టార్ పుట్టాడు.. తనే యష్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2.. ఒకదాన్ని మించి.. మరోటి హిట్టయ్యాయి. బాలీవుడ్ లోని పాత రికార్డులన్నీ తిరగేస్తున్న వేళ.. అందరి నోటా.. యష్ మాటే. ఇప్పుడు యష్‌తో సినిమాలు చేయడానికి భారతదేశంలోని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా రెడీనే. కానీ యష్ ఇప్పటి వరకూ తన తదుపరి సినిమాపై ఎలాంటి అప్ డేటూ ఇవ్వలేదు. అయితే., యష్ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయాలో.. ఆచి తూచి నిర్ణయించుకోవాలి.
ఎందుకంటే బాహుబలి తరవాత ప్రభాస్ కీ ఇలానే క్రేజ్ వచ్చింది. అంచనాలు పెరిగిపోవడం వల్ల.. తదుపరి సినిమాలైన సాహో, రాధేశ్యామ్‌లు ఆడలేదు. ఎలాంటి కథలు ఎంచుకోవాలన్న విషయంలో ప్రభాస్ లో ఇంకా కన్‌ఫ్యూజ్ వెంటాడుతూనే ఉంది. దాంతో కథల విషయంలో ప్రభాస్ తప్పులు చేస్తున్నాడు. ఈ తప్పులు యష్ చేయకూడదు. అలాగని... సినిమాలు చేసే విషయంలో ఆలస్యం ఉండకూడదు. ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి... యష్ కి అవేం లేవు. కేజీఎఫ్ 2 తరవాత ఏం చేయాలన్న విషయంలో యష్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. కొంత కాలం గ్యాప్ తీసుకుని, అప్పుడు తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాడట యష్. మరి ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.