సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక రాజకీయ నాయకుడన్న విషయం చాలా మంది మర్చిపోయారు. అప్పుడప్పుడు పార్లమెంట్‌లో కనిపిస్తేనే ఆయన రాజకీయ నాయకుడన్న తలంపు వస్తోందట చాలా మందికి. రాజకీయాల పరంగా చిరంజీవిపై చాలా విమర్శలు చేసిన వాళ్లైనా కానీ, ఓ సినిమా హీరోగా ఆయనని ఇష్టపడే వాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ 'ఫ్యాన్ మూమెంట్' అనే ట్యాగ్ లైన్ జత చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ మూమెంట్ సమయంలో ఎంపీ కవిత, కాంగ్రెస్ పార్టీ పైనా, అదే పార్టీలో ఉన్న చిరంజీవిపైనా అనేక విమర్శలు చేశారు. కానీ రాజకీయం రాజకీయమే. సినిమాల పరంగా ఆయనపైన ఉన్న అభిమానం అభిమానమే అని ఎంపీ కవిత చెప్పకనే చెప్పింది ఈ పిక్ ద్వారా. అలాగే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్‌కీ, కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కీ మధ్య మంచి స్నేహం ఉంది. రామ్ చరణ్ సినిమా ఆడియో ఫంక్షన్స్‌కి కేటీఆర్ హాజరై, తన విషెస్‌ని అందిస్తూ ఉంటారు. అలాగే కేటీఆర్ సన్నిహితుడి సినిమా 'కాదలి' ఆడియో ఫంక్షన్‌కి రామ్ చరణ్ విచ్చేసి ఆ సినిమాకి తన సపోర్ట్‌ని అందించారు. ఇలా సినిమా అభిమానం సినిమాదే. రాజకీయ విమర్శల దాడి రాజకీయాలదే. అదీ ఇదీ కలిపి చూడకూడదు, కంపేర్ చేయకూడదు అని నిరూపిస్తున్నారు మన సినీ, రాజకీయ నాయకులు.