రాజమౌళిపై ఉన్న నమ్మకంతో దాదాపు 5 ఏళ్ల తన కెరీర్‌ని బాహుబలి కోసం త్యాగం చేశాడు ప్రభాస్. ఈ కాలంలో ప్రభాస్ కనీసం 5 సినిమాలైనా చేసి ఉండేవాడు. కానీ అవేం పట్టించుకోకుండా.. బాహుబలి కోసం కావల్సినన్ని కాల్షీట్లు ఇచ్చాడు. పెళ్లిని సైతం పక్కన పెట్టాడు. ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమా లేదని రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాంటి ప్రభాస్‌కి పారితోషికంగా ఎంతిచ్చారు?? అనేదే టాలీవుడ్‌ని ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. తొలి భాగం కోసం ప్రభాస్ కి దాదాపు గా రూ.24 కోట్ల వరకూ ఇచ్చారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఆ అంకె నమ్మశక్యంగానే ఉంది. అయితే ఇప్పుడు రెండో భాగం కోసం ప్రభాస్‌కి రూ.50 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. అంటే రెండు భాగాలకూ రూ.74 కోట్లు ముట్టిందన్నమాట. అదే నిజమైతే పారితోషికం విషయంలో సౌత్ ఇండియన్ స్టార్లందరినీ ప్రభాస్ దాటేసినట్టే. కానీ ఆర్కా మీడియా పారితోషికం విషయంలో మరీ ఇంత ఉదారంగా వ్యవహరిస్తుందా?? అనేది అనుమానంగానే మారింది. పార్ట్ 2 కోసం ప్రభాస్‌కి రూ.30 కోట్లకు మించి పారితోషికం అందడం అసాధ్యమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ అంకెల్లో ఎంత నిజమో ఇచ్చిన వాళ్లకు, తీసుకొన్నవాళ్లకే తెలియాలి.