నటీనటులు: అదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ మోతే
దర్శకత్వం: సంతోష్ పి.జయకృష్ణ
సంగీతం: బాల మురళి
ఎడిటర్: జి.కె. ప్రసన్న
విడుదల తేదీ: మార్చి 21, 2019
రేటింగ్ - 2/5
'మా సినిమా ఇంటిల్లిపాదీచూడొచ్చు' - అని చెప్పడం మనం ఇప్పటి వరకూ విన్నాం. 'మా సినిమాకి ఫ్యామిలీస్‌తో రావొద్దు.. ఇబ్బంది పడతారు' అని ముందే హింటిస్తే ఏమనాలి? - ఇది నయా జమానా అని సర్దుకుపోవాలి. అడల్ట్ కామెడీ సినిమాల ప్రచార వ్యవహారాలు అలానే ఉంటాయి. బూతుకి కాస్త కామెడీ కోటింగ్ ఇచ్చి జనాల్లోకి వదిలేస్తుంటారు.
ఇప్పట్లో సినిమాని నడిపించేది యూతే కాబట్టి... వాళ్లలో కొంతమంది సినిమా చూసినా చాలన్నది సినీ రూపరక్తల నమ్మకం. అందులో భాగంగానే 'చీకటి గదిలో చితగ్గొట్టుడు' అనే సినిమాని తయారు చేసి వదిలారు. ఇదో అడల్ట్ కామెడీ సినిమా అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లలో బూతు కంటెంట్ నిరభ్యంతరంగా చూపించేశారు. మరి సినిమా ఎలా ఉంది? యూత్‌ని ఏమాత్రం ఆకట్టుకుంటుంది..? ఈ విషయాల్లోకి వెళ్తే.
* కథ
చందు (అరుణ్ అదిత్) ప్లే బాయ్ టైపు. అమ్మాయిల్ని పడగొట్టడంలో దిట్ట. డేటింగ్ పేరుతో చాలామంది అమ్మాయిలతో తిరిగి చివరికి పూజ (నిక్కి తంబోలా) ని లైఫ్ పార్టనర్‌గా చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. పెళ్ళికి పూజతో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని భావించి తన స్నేహితుడు, అతని గాళ్ ఫ్రెండ్ (హేమంత్ - భాగ్యశ్రీ)లతో కలసి బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ ఓ బంగ్లాలో సెటిలై.. లైఫ్‌ని ఎంజాయ్ చేయడం మొదలెడతారు. అయితే ఆ బంగ్లాలో ఓ ఆడదెయ్యం ఉంటుంది. చందునీ శివ(హేమంత్)నీ ఓ ఆట ఆడుకుంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? చందు - శివలను ఎందుకు టార్గెట్ చేసుకుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
* విశ్లేషణ
ఇదో అడల్ట్ సినిమా అని ముందే చెప్పేశారు కాబట్టి.. ఈ విషయంలో దర్శకుడ్నీ, నిర్మాతనీ ఏమీ అనలేం. ఇంత బూతేంటి? ఇది సినిమా అనుకున్నారా, బ్లూ ఫిల్మ్ అనుకున్నారా? అని కూడా అడగలేం. ఎందుకంటే ఈ సినిమాకి వెళ్లే ప్రేక్షకుడు ఇందులో మసాలా ఉంటుందని ఫిక్సయ్యే వెళ్తాడు. దానికి తగ్గట్టుగానే బూతులు, అడల్ట్ సీన్లూ.. పేర్చుకుంటూ వెళ్లిపోయాడు. పెళ్లి కాకుండానే హనీమూన్ వెళ్లిన రెండు జంటల మధ్య ఏం జరగాలో, ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటారో... అవన్నీ ఈ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ద్వారా చూపించాడు.
తొలి సగం అంతా దాదాపు ఇలాంటి సన్నివేశాలతో నడిచిపోతుంటుంది. ప్రియురాళ్లని ఏదోలా అనుభవించాలి అనుకునే శివ, చందుల ప్రయత్నాలను దెయ్యం అడ్డుకోవడం, వాళ్ల ఆశలపై నీళ్లు చల్లడం.. ఇదో ప్రహసనంలా మారిపోతుంది. ఇద్దరు హీరోయిన్ల చేతా కావల్సినంత స్కిన్ షో చేయించాడు దర్శకుడు. నిజానికి ఇది ఇరుట్టూ అరైయిల్ మురట్టు కుత్తు అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో కాసిన్ని డబ్బులు రావడంతో ఈ సినిమాని తెలుగులోనూ దించేశారు. తమిళ సినిమాలో ఏదైతే చూపించారో, సేమ్ టూ సేమ్ తెలుగులోనూ దించేశారు.
తమిళంతో పోలిస్తే తెలుగులోనే బూతులు ఎక్కువ వినిపిస్తాయి. హిందీలో అడల్ట్ మూవీస్ కొన్ని వచ్చాయి. కానీ వాటిలో కాస్త గమ్మత్తైన కథ, కథనాలు ఉంటాయి. కేవలం బూతుమీదే ఆధారపడలేదు. ఈ సినిమా అలా కాదు. కథ, కథనాలు నీరసంగా సాగుతాయి. అడల్ట్ సీన్ల వల్ల సినిమా ఆడేస్తుందనుకుని వాటిపైనే విపరీతంగా ఆధార పడ్డారు. బూతులో కామెడీ మిక్స్ చేయడం కూడా ఓ ఆర్టే. కానీ... ఆ సమ్మేళనం తెలివిగా ఉండాలి. లేదంటే కేవలం బూతుగానే మిగిలిపోతుంది. ఇలాంటి అడల్ట్ కంటెంట్.. వెబ్ సిరీస్‌లలో బోల్డంత దొరుకుతోంది. వాటి కోసం పనిగట్టుకుని సినిమా థియేటర్ల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
* నటీనటులు
అరుణ్ అదిత్ టైమింగ్ బాగుంది. తన వంతు న్యాయం చేశాడు. అయితే మిర్చి హేమంత్‌ని పూర్తి నిడివి ఉన్న పాత్ర పోషించడం ఇదే తొలిసారి. తను మాత్రం బాగా తడబడ్డాడు. ఆ ప్లేసులో మరో నటుడ్ని తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. హీరోయిన్లు ఇద్దరూ స్కిన్ షో విషయంలో పోటీ పడ్డారు. ఎద భాగాల్ని చూపించడమే నటన అనుకున్నారేమో..? నిజంగానే ఇలాంటి సినిమాల్లో నటించడానికి కూడా గట్స్ ఉండాలి. పోసాని, రఘుబాబు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్.. ఇలా సమర్థులైన హాస్య నటులు ఉన్నా, వాళ్లని సంపూర్ణంగా వాడుకోలేకపోయాడు.
* సాంకేతిక వర్గం
తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ రీమేక్ బాధ్యతల్నీ స్వీకరించాడు. తమిళ సినిమాకీ తెలుగు సినిమాకీ పెద్ద తేడా లేదు కాబట్టి... తను ఇక్కడ కొత్తగా చేసిందేం లేదనే చెప్పాలి. బూతునీ, నవ్వునీ మిక్స్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సింది కూడా రాబట్టుకోలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. లొకేషన్లు అలరిస్తాయి. నేపథ్య సంగీతం రోతగా ఉంది.
* ప్లస్ పాయింట్స్
+ బూతు
* మైనస్ పాయింట్స్
- బూతు
ఫైనల్ వర్డిక్ట్: థియేటర్లో చితగ్గొట్టుడు.
- రివ్యూ రాసింది శ్రీ.