రాజమౌళి సినిమా అంటే.. ఇప్పుడు టాలీవుడ్‌కే పరిమితం కాదు. బాహుబలి తరవాత రాజమౌళి రేంజు పెరిగింది. ఆయన సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే #RRRని దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌ని ఆకర్షించడానికి అక్కడి నటీనటుల్ని ఎంచుకున్నారు. కథానాయికలు, కీలక పాత్రల కోసం బాలీవుడ్ నుంచి నటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఆలియాభట్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్‌ల రాకతో.... ఈ సినిమాపై బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది.
2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించేశాడు రాజమౌళి. అయితే సరిగ్గా అదే సమయంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ప్రతీ సారీ రంజాన్ పండక్కి తన సినిమాని విడుదల చేయడం సల్మాన్ ఖాన్‌కి అలవాటు. 2020లో కూడా సరిగ్గా ఈద్‌కి సల్మాన్ తన సినిమాని విడుదల చేస్తున్నాడు. రాజమౌళి సినిమా ఉందని తెలిసినా.. సల్మాన్ వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు అటూ ఇటుగా అక్షయ్ కుమార్ సినిమా కూడా రాబోతోంది. ఈ రెండు సినిమాలూ వస్తే గనుక #RRR కి బాలీవుడ్‌లో గట్టి పోటీ ఎదురుకాక తప్పదు.
బాలీవుడ్‌లో వసూళ్లు కుమ్ముకోవొచ్చు అనుకున్న రాజమౌళికి ఇది గట్టి షాకే.