నటీనటులు: వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్ తదితరులు..
సాంకేతికవర్గం:
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి,
కూర్పు: బిక్కిని తమ్మిరాజు,
నిర్మాణం: శిరీష్, లక్ష్మణ్,
సమర్పణ: దిల్‌రాజు,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 12 జనవరి 2019
రేటింగ్: 3/5
కుటుంబ కథల్లో వెంకటేష్ ఎలా ఒదిగిపోతుంటారో ఆయన ఇదివరకు చేసిన సినిమాలే చాటి చెప్పాయి. ఆయన ఇమేజ్‌ని పక్కనపెట్టి మరీ సందడి చేస్తుంటారు. అది కుర్రాళ్ల దగ్గర్నుంచి ఇంట్లో మహిళల వరకు అందరికీ నచ్చుతుంటుంది. వరుణ్‌తేజ్‌కి ఆ నేపథ్యం కొత్తే అయినా.. వెంకీతో కలవడంతో ఈ కాంబినేషన్ ఆసక్తి రేపింది. ఇక సందర్భోచితంగా కామెడీ పండించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో అనిల్ రావిపూడికి ఇప్పటికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇలా వీళ్లందరినీ కలిపి పండగ సినిమాగా `ఎఫ్2`ని నిర్మించాడు దిల్‌రాజు. ఆయన సంస్థ నుంచి సినిమా అనగానే కచ్చితంగా కుటుంబ కథనే ఊహిస్తారు ప్రేక్షకులు. మరి `ఎఫ్2` ఎలా ఉంది? ఇందులో ఫన్ ఎంత? ఫ్రస్ట్రేషన్ ఎంత? తెలుసుకుందాం పదండి...
కథ
హారిక (తమన్నా), హనీ (మెహరీన్) అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ కూడా గడుసైన అమ్మాయిలే. హారికని చూసి పెళ్లి చేసుకుంటాడు వెంకీ (వెంకటేష్). పెళ్లి తర్వాత ఆర్నెళ్లు జీవితం చాలా సరదాగా గడిచిపోతుంది. ఆ తర్వాతే అసలు చిక్కులు మొదలవుతాయి. ఇద్దరి మధ్య ప్రతి చిన్న విషయానికీ కీచులాటలు మొదలవుతాయి. ఇంతలో మరదలు హనీ, బోరబండ బస్తీకి చెందిన వరుణ్‌యాదవ్ (వరుణ్‌తేజ్)ని ప్రేమిస్తుంది. పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. రెండో అల్లుడు వస్తుండడంతో ఆ ఇంట్లో వెంకీ ప్రాధాన్యం మరింత తగ్గిపోతుంది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో వరుణ్‌కి చెబుతూ ఫ్రస్ట్రేషన్‌కి గురవుతుంటాడు వెంకీ. నువ్వు కూడా హనీని పెళ్లి చేసుకోవద్దని సూచిస్తుంటాడు. కానీ వినకుండా వరుణ్ యాదవ్ పెళ్లికి సిద్ధమవుతాడు. మరి వరుణ్ పెళ్లి జరిగిందా లేదా? అన్నదమ్ములిద్దరూ యూరప్‌కి ఎందుకు పారిపోతారు? అక్కడికి వెళ్లాక వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
కథానాయకులు వెంకటేష్, వరుణ్‌తేజ్ రెచ్చిపోయారనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ తన మార్క్ వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. తనకి అలవాటైన పాత్రే కాబట్టి ఒదిగిపోయి నటించాడు. ప్రతి చోటా నవ్వించాడు. వరుణ్ కూడా బస్తీ కుర్రాడిగా పర్వాలేదనిపిస్తాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తమన్నా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కథానాయికగా ప్రాధాన్యమున్న పాత్రలో తెరపై మెరిసింది. మెహరీన్ పాత్రకి మేనరిజమ్, ఆమె చేసే సందడి కూడా ఆకట్టుకుంటుంది. ప్రకాష్‌రాజ్, నాజర్‌ల పాత్రలు ద్వితీయార్థంలో ఆకట్టుకుంటాయి. ప్రియదర్శి రఘుబాబు, అన్నపూర్ణమ్మ, వై.విజయ, ఝాన్సీ, ప్రగతి నవ్వించారు. సుబ్బరాజు, సత్యం రాజేష్, వెన్నల కిషోర్ తదితర నటులున్నా వారి నుంచి ఆశించినంత కామెడీ మాత్రం పండలేదు. ఆ పాత్రల పరిధి పరిమితంగా ఉంటుంది.
విశ్లేషణ
భార్యాభర్తల బంధం... అందులోని ఆటుపోట్లని ఎంత సీరియస్‌గా చర్చించవచ్చో, అంత సరదాగా కూడా చెప్పొచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి రెండో మార్గాన్నిఎంచుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకొస్తాయనే విషయాన్ని దర్శకుడు తనదైన శైలి హాస్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కథ, కథనాల కంటే కూడా పాత్రీకరణల్లోనే బలం కనిపిస్తుంది. భార్యాబాధితులకి బ్రాండ్ అంబాసిడర్‌లాగా వెంకటేష్ పాత్రని తీర్చిదిద్ది, ఆ నేపథ్యంలో సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. సరదా జీవితాన్ని ఆస్వాదించే ఓ బస్తీ కుర్రాడు ఉన్నట్టుండి అమ్మ, ప్రేమించిన అమ్మాయి మధ్య నలిగిపోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో చూపుతూ వరుణ్ పాత్రని తీర్చిదిద్దాడు.
ఇలా పర్‌ఫెక్ట్‌గా కామెడీ పండేలా పాత్రల్ని, వాటి చుట్టూ సన్నివేశాల్ని డిజైన్ చేసుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంతో ప్రథమార్థం ఎక్స్‌ప్రెస్ బండిలా శరవేగంగా దూసుకెళుతుంది. కానీ ద్వితీయార్థంలోకి వచ్చేసరికే ఆ బండి జోరు తగ్గింది. ద్వితీయార్థంలో చెప్పేందుకు బలమైన కథ లేకపోవడం... కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన పాత్రల్లో వినోదం పండించేంత సత్తా లేకపోవడంతో సన్నివేశాల కూర్పులా మారిపోయింది సినిమా. కానీ దర్శకుడిలో ఉన్న రచనా పటిమ వల్ల డైలాగ్స్, సిచువేషనల్ కామెడీతో బండికి బ్రేకులు పడకుండా అలా ముందుకు సాగిపోతుంది.
సాంకేతిక వర్గం...
దేవిశ్రీప్రసాద్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రెచ్చిపోదాం బ్రదర్ పాట బాగుంది. సమీర్‌రెడ్డి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశాన్నీ కలర్‌ఫుల్‌గా చూపించారు. నిర్మాణ విలువలు దిల్‌రాజు సంస్థ స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. అనిల్ రావిపూడి రచనలో బలం ఈ సినిమాలో మరోసారి కనిపిస్తుంది. అయితే అది మాటల వరకే పరిమితమైంది. కథ పరంగా మరికొన్ని హంగులు అవసరం అనిపిస్తుంది.
ప్లస్సులు
వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల నటన
ప్రథమార్థం
మాటలు, వినోదం
మైనస్‌లు
కథ
ద్వితీయార్థంలో వినోదం తగ్గడం
ఫైనల్ వర్డిక్ట్... సంక్రాంతి అల్లుళ్లు నవ్విస్తారు.
రివ్యూ రాసింది శ్రీ.